Sonu Sood : బాలీవుడ్ నటుడు సోనూసూద్, ఎంపీ కంగనా రనౌత్ తాజాగాచేసిన వ్యాఖ్యలపై స్పందించారు. జెన్-జీ యువతపై కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. యువతను గౌరవించాలని, ప్రతి ఒక్కరూ మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా తూచుకోవాలని ఆయన హితవు పలికారు. మీడియాతో సోనూసూద్ మాట్లాడుతూ… తాను మొదట కంగనా చేసిన వ్యాఖ్యలను వినలేదని చెప్పారు. అయితే, సమాజంలోనూ, సెలబ్రిటీల ఎదుగుదలలోనూ యువత పాత్ర ఎంత కీలకమైనదో ఆయన వివరించారు. ఎవరైనా సరే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారంటే దానికి ప్రధాన కారణం యువతేనని, వారే స్టార్స్ తయారు చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

యువత మన వెనుక ఉన్నంత కాలం మనం ఎదుగుతూనే ఉంటాము. ఒకవేళ వారు మనతో లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. అందుకే అందరినీ కలుపుకుని వెళ్లాలి అని సోనూసూద్ తెలిపారు. నటులైనా, డాక్టర్లయినా లేదా ఏ వృత్తిలో ఉన్నవారైనా… ప్రజలతో అనుబంధం ఉన్నంత వరకే ఈ ప్రపంచంలో మన అస్తిత్వానికి ఒక అర్థం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

అయితే, కంగనా రనౌత్ యువతను గటర్ అని సంబోధించారని ఒక రిపోర్టర్ మళ్లీ గుర్తు చేయగా… సోనూసూద్ తీవ్రంగా స్పందించారు. ఆమె అలా మాట్లాడి ఉంటే అది చాలా సిగ్గుచేటని, అలా మాట్లాడకూడదని అన్నారు. ఏ మాట మాట్లాడే ముందైనా ఎంతో ఆలోచించాలని, ఎందుకంటే ప్రజలే దేవుని మరో రూపమని ఆయన అన్నారు.

మరోవైపు, కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా జెన్-జీ నిరసనకారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జంతర్ మంతర్ తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్న యువత వాడుతున్న భాషను ఆమె తప్పుబట్టారు. ఆ నిరసనల రీల్స్ చూస్తే తనకు కడుపులో వికారం పుట్టిందని, తన జీవితంలో అంతటి అసహ్యాన్ని ఎప్పుడూ చూడలేదని ఆమె రాసుకొచ్చారు.

యువత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ… వాళ్లు డ్రగ్స్, డ్రింక్స్ తీసుకుంటూ సిగ్గులేకుండా తల్లిదండ్రుల సంపాదనతో బతుకుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా, వారిని జెన్-జీ గటర్ అని ఆమె అభివర్ణించారు. కొందరికి సిస్టమ్‌కు ఇచ్చేందుకు ఏమీ లేదని, చదువులో రాణించలేరని, చివరకు గృహిణులుగా కూడా ఉండలేనంతగా వారు చెడిపోయారంటూ ఆమె తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కంగనా వ్యాఖ్యలపై సోనూసూద్ స్పందించిన తీరు ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.