క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక సమస్యలు.. రాబోయే పదేళ్లలో ఇవన్నీ కేవలం గతం తాలూకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయా? అవుననే అంటున్నారు ప్రపంచ ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థల అధినేతలు.

ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోదీ మాట్లాడుతూ, AI సాయంతో బయోలాజికల్ రీసెర్చ్, సరికొత్త మందుల ఆవిష్కరణ ఊహించని వేగంతో జరుగుతుందని, మానవాళిని శతాబ్దాలుగా వేధిస్తున్న రోగాలకు చెక్ పెట్టే “అద్భుతాల యుగం” రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ డీప్‌మైండ్ అధినేత డెమిస్ హస్సాబిస్ కూడా ఇదే అభిప్రాయాన్ని సమర్థిస్తూ, పదేళ్ల డ్రగ్ డిస్కవరీ ప్రాసెస్‌ను AI కేవలం కొన్ని వారాల్లోకి కుదించగలదని పేర్కొన్నారు. 200 మిలియన్లకు పైగా ప్రోటీన్ నిర్మాణాలను మ్యాప్ చేసిన ‘ఆల్ఫాఫోల్డ్’ విజయాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఎలాన్ మస్క్ సైతం భవిష్యత్తులో సామాన్యులకు కూడా అమెరికా అధ్యక్షుడి స్థాయి మెడికల్ కేర్ అందుతుందని అంచనా వేశారు.

Also Read : కిమ్‌ వారసురాలిగా ఆమెనేనా? ఉత్తర కొరియాలో నాలుగో తరం సిద్ధం!

అయితే, ల్యాబ్‌లలో మందులను తయారుచేసే ఫార్మాస్యూటికల్ నిపుణులు, సైంటిస్టులు మాత్రం ఈ టైమ్‌లైన్‌లను కొట్టిపారేస్తున్నారు. వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ లీడెన్ ఇలాంటి వాదనలను పూర్తిగా తోసిపుచ్చారు. తాము సుమారు 50 AI కంపెనీలను, 10,000 డ్రగ్ కాంపౌండ్స్‌ను పరిశీలించినా, ఒక్క AI కూడా సొంతంగా సమర్థవంతమైన మెడిసిన్‌ను రూపొందించలేకపోయిందని స్పష్టం చేశారు.

కంప్యూటర్ స్క్రీన్‌పై ఒక మాలిక్యూల్ ఆశాజనకంగా కనిపించడం తొలి అడుగు మాత్రమే. ఒక ఔషధం మార్కెట్లోకి రావడానికి అవసరమైన క్లినికల్ ట్రయల్స్, జంతువులు-మనుషులపై బయోలాజికల్ టెస్టింగ్, రెగ్యులేటరీ అప్రూవల్స్ లాంటి 10 నుంచి 12 ఏళ్ల ప్రక్రియను AI ఒక్క రాత్రిలో మాయం చేయలేదు.

గ్యారీ మార్కస్, ఎరిక్ టోపోల్ లాంటి ప్రముఖ విశ్లేషకుల ప్రకారం.. ప్రస్తుత AI మోడల్స్‌కు మానవ శరీర జీవక్రియలపై లోతైన బయోలాజికల్ అవగాహన ఇంకా లేదు. 1970ల ‘వార్ ఆన్ క్యాన్సర్’ వైఫల్యాల తరహాలోనే, అతిగా అంచనాలు పెంచి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI పరిశోధనలను వేగవంతం చేస్తుందన్నది ఎంత నిజమో, వ్యాధులన్నీ పదేళ్లలో సమూలంగా నయమవుతాయనడం ప్రస్తుతానికి అంతే పెద్ద ఊహ!

Also Read : ఇరాన్-అమెరికా యుద్ధం నిజంగా ముగిసిందా? ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు రహస్యం!