ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. సాధారణంగా ఆందోళనకారులను అడ్డుకునే పోలీసులే, నిరసనకారుల అవతారమెత్తారు. తోటి అధికారుల బదిలీలను వ్యతిరేకిస్తూ డ్యూటీలో ఉన్న పోలీసులను వారి సొంత సహచరులే గేటు బయట అడ్డుకోవాల్సిన విచిత్ర పరిస్థితి తలెత్తింది.

Also Read : దీపావళి స్వీట్లలో డేంజర్.. ఫేక్ స్వీట్లను కనిపెట్టడం ఎలాగంటే?

వివాదానికి దారితీసిన అసలు కారణం

అక్టోబర్ 23న షాదారా పోలీస్ స్టేషన్‌లో లాయర్లకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరిగాయి. ఈ గొడవలో లలిత్ బన్సల్ అనే అడ్వకేట్ తలకు తీవ్ర గాయమైంది. పోలీసులే తమతో దురుసుగా ప్రవర్తించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఢిల్లీలోని అన్ని డిస్ట్రిక్ట్ కోర్టుల బార్ అసోసియేషన్లు నిరవధిక సమ్మె ప్రకటించాయి. దీంతో కోర్టు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పరిస్థితిని శాంతింపజేసేందుకు, లాయర్ల సమ్మెను విరమింపజేసేందుకు ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదంలో చిక్కుకున్న ఏసీపీ మానస్వి వసిష్ట, షాదారా SHO ఇన్‌స్పెక్టర్ అరుణ్ కుమార్‌లను వెంటనే బదిలీ చేశారు. లాయర్ల ఫిర్యాదులపై 2 నెలల్లో పూర్తి విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో అడ్వకేట్లు సమ్మె విరమించారు. అయితే, ఏకపక్షంగా జరిగిన ఈ బదిలీలపై పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర అసంతృప్తి రాజుకుంది.

లాయర్ల ఒత్తిడికి తలొగ్గి అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ, సమస్యపై చర్చించేందుకు ‘ఓపెన్ హౌస్’ నిర్వహించాలని కోరుతూ ఏసీపీ వసిష్ట నేరుగా పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్‌కు లేఖ రాశారు. ట్రాన్స్‌ఫర్ అయిన ఏసీపీ వసిష్ట ఈ నిరసనకు నాయకత్వం వహించగా, న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున మద్దతు పలికారు.

Also Read : UPI రికార్డు: అక్టోబర్‌లో రూ. 31.53 లక్షల కోట్ల పేమెంట్స్!

రెండు దశల్లో నిరసన – పీహెచ్‌క్యూ వద్ద టెన్షన్

ఈ ప్రదర్శన 2 దశల్లో సాగింది. తొలుత హెడ్‌క్వార్టర్స్ వెలుపల గుమిగూడిన సిబ్బంది, ఆ తర్వాత కాంపౌండ్ లోపలికి వెళ్లి నిరసన చేపట్టారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు న్యూఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ రంగంలోకి దిగారు. “మనం ఒక క్రమశిక్షణ గల ఫోర్స్ సభ్యులం, నిరసనకారుల్లా రోడ్లపై కూర్చోవడం సరికాదు. సమస్య ఏదైనా ఉంటే ఆఫీస్ లోపల కూర్చుని సీనియర్లతో మాట్లాడి పరిష్కరిద్దాం” అని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సిబ్బంది వెనక్కి తగ్గకపోవడంతో శర్మ, వసిష్ట మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది.

ముందుజాగ్రత్త చర్యగా హెడ్‌క్వార్టర్స్ గేట్ నెం.1 వద్ద భారీగా పోలీస్ ఫోర్స్, పారామిలిటరీ బలగాలను మోహరించి సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. గతంలో 2019 నవంబర్‌లో తీస్ హజారీ కోర్టు గొడవల సమయంలో ఇలాగే పోలీసులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు అదే స్థాయిలో ఖాకీ వర్సెస్ ఖాకీ అన్నట్లుగా ఢిల్లీ హెడ్‌క్వార్టర్స్ ఎదుట నిరసన జరగడం దేశ రాజధానిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.