
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) మొదలైన తర్వాత గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో ఊహించని మార్పులు వచ్చాయి. ముఖ్యంగా యూరప్‌లో మందుగుండు సామగ్రికి భారీ డిమాండ్ ఏర్పడటంతో, భారత రక్షణ రంగానికి కాసుల వర్షం కురుస్తోంది. ఇదే సమయంలో రష్యా నుంచి రాయితీపై క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ దేశీయంగా చమురు ధరల భారాన్ని తగ్గించుకుంటున్న భారత్, అటు యూరప్‌కు రక్షణ ఎగుమతులు చేస్తూ 2 వైపులా ఆర్థిక లబ్ధి పొందుతుండటం గమనార్హం.
Also Read : ICICI Bank బిగ్ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు
బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత కంపెనీలు ఐరోపా దేశాలకు ఏకంగా 872 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,000 కోట్లు) విలువైన ఆయుధ సామగ్రిని ఎగుమతి చేశాయి. యుద్ధానికి ముందు కేవలం 49.2 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ ఎగుమతులు, ఏకంగా 1,600 శాతానికి పైగా పెరిగాయి. ఇందులో యుద్ధ విమానాలు, క్షిపణులు కాకుండా ఫిరంగి గుండ్లు (ఆర్టిలరీ షెల్స్), మోర్టార్లు, పేలుడు పదార్థాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ ఎగుమతుల్లో దాదాపు 75% తూర్పు, మధ్య ఐరోపాలోని 13 దేశాలకే చేరాయి. ప్రస్తుతం ఈ ప్రాంతానికి ఆయుధాలు సరఫరా చేయడంలో దక్షిణ కొరియా తర్వాత భారత్ రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. నాలుగేళ్ల క్రితం 28వ స్థానంలో ఉన్న దేశం ఇప్పుడు టాప్-2కి దూసుకెళ్లింది.
ప్రభుత్వ రంగ సంస్థ మునిషన్స్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’ వ్యూహంతో భారత్ మొత్తం రక్షణ ఎగుమతులు గతేడాది 63% పెరిగి 4 బిలియన్ డాలర్లకు చేరాయి. మరోవైపు రష్యాతో భారత్‌కు దౌత్యపరమైన, రక్షణపరమైన బలమైన సంబంధాలు ఉన్నాయి. యుద్ధ సమయంలోనూ రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తూ భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకుంటోంది, ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తోంది. అదే సమయంలో యూరప్‌కు భారీగా మందుగుండు విక్రయిస్తూ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని చాటుకుంటోంది. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన నిర్ణయమని, ఏ ఒక్క పక్షానికీ తాము కొమ్ముకాయడం లేదని భారత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read : క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఆర్బీఐ బిగ్ రిలీఫ్.. లేట్ పేమెంట్‌పై ఇక ఛార్జీలు లేనట్టే!









