
Lula Da Silva : లాటిన్ అమెరికాలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రెజిల్ రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. దేశాధ్యక్ష ఎన్నికల హోరాహోరీ పోరులో ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డ సిల్వా ఘన విజయం సాధించారు. వామపక్ష నాయకుడైన లూలా.. మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తనయుడు, సెనేటర్ ఫ్లావియో బోల్సోనారోను ఓడించి, నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధమయ్యారు.
సుపీరియర్ ఎలక్టోరల్ కోర్ట్ వెల్లడించిన అధికారిక ఫలితాల ప్రకారం లూలాకు 51.8 శాతం ఓట్లు రాగా, బోల్సోనారో 48.2 శాతంతో సరిపెట్టుకున్నారు. దాదాపు 40 లక్షల ఓట్ల మెజారిటీతో లూలా విజయం నమోదు చేశారు. బ్రెజిల్లో 1980ల తర్వాత మొదటి రౌండ్లో వెనుకబడిన నేత, ఫైనల్ రన్ఆఫ్ పోరులో నెగ్గి ప్రెసిడెంట్ కావడం ఇదే మొదటిసారి. మొదటి విడతలో బోల్సోనారో 47 శాతం ఓట్లతో లీడ్‌లో ఉండగా, లూలా 45 శాతంతో రెండో స్థానంలో నిలిచారు.
Also Read : హర్మూజ్‌లో దాడులు.. దెబ్బతిన్న 30 సూపర్ ట్యాంకర్లు.. సంక్షోభంలో చమురు రవాణా!
అయితే రన్ఆఫ్కు ముందు లూలా తన క్యాంపెయిన్ స్ట్రాటజీని పూర్తిగా మార్చేశారు. ‘మళ్లీ బోల్సోనారో వద్దు’ అనే ప్రధాన స్లోగన్‌తో మెగా ర్యాలీలు నిర్వహించడం, సోషల్ మీడియా క్యాంపెయిన్ విస్తరించడం, వెల్ఫేర్ స్కీమ్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై ఇచ్చిన హామీలు ఆయనను గెలుపు తీరాలకు చేర్చాయి. ఫలితాల అనంతరం సావోపాలో సహా ప్రధాన నగరాల్లో కార్యకర్తలు భారీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో లూలా 2003 నుంచి 2010 వరకు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత ఎదురైన లీగల్ సమస్యల నుంచి బయటపడి 2023లో మళ్లీ పగ్గాలు చేపట్టారు. ఆయన హయాంలో తగ్గిన ద్రవ్యోల్బణం, పెరిగిన ఉపాధి అవకాశాలు ఈ ఎన్నికల్లో ఆయనకు ప్లస్ అయ్యాయి.
అయితే, జనవరి 5 నుంచి ప్రారంభం కానున్న లూలా నాలుగో విడత పాలన అంత ఈజీగా సాగేలా లేదు. పార్లమెంట్లో బోల్సోనారోకు చెందిన కన్జర్వేటివ్ (రైట్-వింగ్) కూటమి భారీ బలాన్ని సాధించింది. దీనికి తోడు పెరిగిన ద్రవ్యలోటు, లివింగ్ కాస్ట్, ప్రభుత్వ అప్పులు ఆయన ముందున్న బిగ్ ఛాలెంజెస్. ఏదేమైనా, లాటిన్ అమెరికా రీజియన్‌లో రైట్-వింగ్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో లూలా గెలుపు ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచింది.
Also Read : సెర్బియాలో14 ఏళ్ల ప్రభుత్వాన్ని కూల్చిన విద్యార్థుల విప్లవం.. అసలు అక్కడ ఏం జరిగింది?









