
పాప్ రారాజు, మూన్‌వాకర్ మైఖేల్ జాక్సన్ మరణించి దాదాపు 17 ఏళ్లు గడుస్తున్నా ఆయన ఆస్తుల చుట్టూ వివాదాలు మాత్రం ముగియడం లేదు. తాజాగా ఆయన కుమార్తె పారిస్ జాక్సన్ తన తండ్రి ఎస్టేట్ నిర్వాహకులపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ లాస్ ఏంజిల్స్ కోర్టును ఆశ్రయించారు. జాక్సన్ ఎస్టేట్ నుంచి సుమారు 600 మిలియన్ డాలర్లను (భారత కరెన్సీలో సుమారు రూ.5,000 కోట్లకు పైగా) ఫ్యామిలీ ట్రస్టుకు తక్షణమే బదిలీ చేయాలని ఆమె లీగల్ పిటిషన్ దాఖలు చేశారు.
2009 జూన్‌లో 50 ఏళ్ల వయసులో మైఖేల్ జాక్సన్ ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయనకు ప్రిన్స్, పారిస్, బిగి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన మరణానంతరం పిల్లల భవిష్యత్తు కోసం జాక్సన్ ఒక ప్రత్యేక ఫ్యామిలీ ట్రస్టును ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం.. పిల్లలకు 21 ఏళ్లు నిండిన తర్వాత ట్రస్ట్ ఆదాయం నుంచి వారి వాటాను క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పారిస్ జాక్సన్ వయస్సు 28 ఏళ్లు దాటింది. వయసు పరిమితి దాటినా ట్రస్ట్ నుంచి తమకు రావాల్సిన రాబడి సక్రమంగా అందడం లేదని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మైఖేల్ జాక్సన్ లెగసీ మ్యూజిక్ డీల్స్, భారీ ప్రాపర్టీ సేల్స్ ద్వారా ఎస్టేట్‌కు బిలియన్ల కొద్దీ డాలర్ల రెవెన్యూ వచ్చిపడుతోంది. ఎస్టేట్ అంత పెద్ద మొత్తంలో లాభాలు గడిస్తున్నప్పటికీ, ఫ్యామిలీ ట్రస్టుకు మాత్రం ఎటువంటి ఆదాయం జమ కావడం లేదని పారిస్ ఆరోపిస్తున్నారు. అందుకే ఎస్టేట్ ఫండ్స్ నుంచి 600 మిలియన్ డాలర్లను ట్రస్టుకు షిఫ్ట్ చేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు.
అయితే, ఈ డిమాండ్‌ను ఎస్టేట్ ఎగ్జిక్యూటర్లు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతానికి అనేక లీగల్ కాంప్లికేషన్స్, న్యాయపరమైన చిక్కులు పెండింగ్‌లో ఉన్నాయని, అవన్నీ క్లియర్ అయ్యే వరకు ట్రస్టుకు ఎలాంటి ఫండ్స్ రిలీజ్ చేయలేమని వారు తెగేసి చెబుతున్నారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు రాబడుతున్న ఎంజే ఎస్టేట్.. మరోవైపు హక్కుల కోసం కోర్టుకెక్కిన ఆయన వారసులు—ఈ హై-ప్రొఫైల్ లీగల్ వార్ హాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.









