హైదరాబాద్ వారసత్వమున్న భారతీయ అమెరికన్ ముస్లిం యువతి నబీలా సయ్యద్ అమెరికా రాజకీయాల్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే ఆమె ఇల్లినాయ్ స్టేట్ సెనేట్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. నవంబర్ 2026 మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున 26వ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన నబీలా, రిపబ్లికన్ అభ్యర్థి డార్బీ హిల్స్‌పై 57 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు.

Also Read : ట్రంప్‌ను ఓడించిన ఇండియన్స్.. ఎందుకంటే?

23 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టి రికార్డు

1980ల్లో హైదరాబాద్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన దంపతులకు షికాగోలోని పాలటైన్‌లో నబీలా జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె, స్వచ్ఛంద సంస్థల్లో డిజిటల్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేశారు. 2022లో కేవలం 23 ఏళ్ల వయసులోనే ఇల్లినాయ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ (51వ డిస్ట్రిక్ట్)కు ఎన్నికై, అసెంబ్లీలో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. 2024లోనూ తన సీటును కాపాడుకున్న ఆమె, వైద్య సేవలు, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఓటింగ్ హక్కులపై కీలక కమిటీల్లో బాధ్యతలు నిర్వర్తించారు.

Also Read : అమెరికా మధ్యంతర ఎన్నికల లెక్కలివే.. ట్రంప్‌కు ఎన్ని సీట్లంటే?

ప్రజా సమస్యలే అజెండాగా సెనేట్‌ ప్రయాణం

ఈ తాజా ఎన్నికల్లో ప్రజలపై పెరుగుతున్న జీవన వ్యయం, హెల్త్‌కేర్ అఫార్డబిలిటీ, నిరుద్యోగం మరియు AI డేటా సెంటర్ల నియంత్రణ వంటి అంశాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకుని ప్రజల మన్ననలు పొందారు.

హైస్కూల్ రోజుల్లోనే ఇమ్మిగ్రెంట్ల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టిన నబీలా, “నేను నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు?” అన్న తన తల్లి ప్రోత్సాహమే తన విజయానికి మూలకారణమని పలుమార్లు గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ నుంచి మొదలైన ఒక సాధారణ కుటుంబ ప్రయాణం, అమెరికాలోని అత్యున్నత చట్టసభలలో ఒకటైన ఇల్లినాయ్ సెనేట్ వరకు చేరడం యావత్ తెలుగు ప్రజలకు, ప్రవాస భారతీయులకు గర్వకారణం. నబీలా సయ్యద్ 2027 జనవరిలో సెనేటర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.