
భారత రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం సరికొత్త మైలురాళ్లను చేరుకుంటోంది. ఇటీవల 450 ‘నాగాస్త్ర-1ఆర్’ కామికాజీ డ్రోన్లను డెలివరీ చేసిన సోలార్ డిఫెన్స్ & ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL), తాజాగా అత్యాధునిక ‘నాగాస్త్ర-2’ యాంటీ-ట్యాంక్ లోయిటర్ మ్యూనిషన్ సిస్టమ్‌ను భారత సైన్యానికి అందించింది. నాగాస్త్ర-2 డ్రోన్ ప్రత్యేకంగా కవచ వాహనాలు, శత్రు ట్యాంకులను ధ్వంసం చేయడానికి డిజైన్ చేయబడింది. ఇందులో డే/నైట్ సర్వైలెన్స్ కెమెరాలతో పాటు 4 కేజీల టాండెమ్ షేప్డ్-ఛార్జ్ వార్‌హెడ్ ఉంటుంది. ఇది 650 మి.మీ రోల్డ్ హోమోజీనియస్ ఆర్మర్ (RHA) రక్షణను కూడా సులభంగా ఛేదిస్తుంది.
రికవరీ అలాగే రీయూజబుల్ మోడ్‌లో 25 కి.మీ, ఫైర్-అండ్-ఫర్గెట్ మోడ్‌లో 50 కి.మీ రేంజ్‌ను కవర్ చేస్తూ, గగనతలంలో 60 నిమిషాల వరకు తిరగగలదు. యుద్ధరంగంలో జీపీఎస్ జామింగ్, స్పూఫింగ్ వంటి ఎలక్ట్రానిక్ దాడులను తిప్పికొట్టే అధునాతన ‘ECCM’ టెక్నాలజీ దీని సొంతం. మరోవైపు, స్వల్ప-శ్రేణి ఆపరేషన్లకు అనువైన నాగాస్త్ర-1ఆర్ డ్రోన్ కూడా కామికాజీ దాడుల్లో అద్భుత కచ్చితత్వాన్ని ప్రదర్శిస్తోంది. అవసరమైతే మిషన్‌ను రద్దు చేసి డ్రోన్‌ను తిరిగి రికవర్ చేసుకునే సౌలభ్యం ఇందులో ఉండటం విశేషం.
Also Read : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఆయుధాల ఎగుమతిలో టాప్-2కి చేరిన భారత్
తేజస్ యుద్ధ విమానాల తయారీకి వేగం
డ్రోన్లతో పాటు భారత వాయుసేన శక్తిని పెంచే తేజస్ Mk1A ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కు మరో ఊతం లభించింది. అమెరికాకు చెందిన ప్రముఖ ‘జీఈ ఏరోస్పేస్’, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)కు మరో నాలుగు F404-IN20 ఇంజిన్లను తాజాగా సరఫరా చేసింది. దీంతో ఇప్పటివరకు HAL స్వీకరించిన మొత్తం ఇంజిన్ల సంఖ్య 14కు చేరుకుంది. 2021లో కుదిరిన రూ. 5,375 కోట్ల విలువైన (99 ఇంజిన్ల) ఒప్పందంలో భాగంగా ఈ సరఫరా వేగవంతమైంది. అత్యాధునిక నాగాస్త్ర సిరీస్ డ్రోన్లు మరియు తేజస్ యుద్ధ విమానాల బలోపేతం భారత సాయుధ దళాల పోరాట పటిమను సరిహద్దుల్లో మరింత ఉన్నత స్థాయికి చేర్చనున్నాయి.
Also Read : ICICI Bank బిగ్ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు









