భారత్, పాకిస్థాన్ మధ్య మరోసారి కీలక దౌత్య పరిణామం చోటుచేసుకోనుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత, మొదటిసారిగా ఒక పాకిస్థాన్ మంత్రి భారత పర్యటనకు రానున్నారు.

ముసాదిక్ మాలిక్ రాక:

న్యూఢిల్లీ వేదికగా నవంబర్ 20 నుంచి 22 వరకు జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్ సమావేశాలకు పాకిస్థాన్ పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 28న అన్ని సభ్య దేశాలకు భారత్ ఆహ్వానాలు పంపిన నేపథ్యంలో, పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది.

మూడేళ్ల గ్యాప్ తర్వాత:
చివరిసారిగా 2023 మే నెలలో గోవాలో జరిగిన SCO సమావేశాలకు అప్పటి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరయ్యారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఏ పాక్ మంత్రి భారత్ రాలేదు. ఇప్పుడు ముసాదిక్ మాలిక్ వస్తే, మూడేళ్ల గ్యాప్ తర్వాత భారత్‌లో అడుగుపెట్టనున్న తొలి పాక్ ఫెడరల్ మంత్రి ఆయనే అవుతారు.

బ్యాక్‌గ్రౌండ్ ఇదే: 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి కౌంటర్‌గా భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర స్థాయిలో డ్రోన్, క్షిపణి దాడులు జరిగి 70 మందికి పైగా మరణించారు. మే 10న ఇరు దేశాల సైనిక అధికారుల చర్చలతో ఉద్రిక్తతలు తగ్గాయి.

వచ్చే ఏడాది ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న SCO సమ్మిట్‌కు ముందు భారత్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. “పరస్పర గౌరవంతో ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, SCO వేదికగా చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం” అని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. అంతకుముందు 2024 అక్టోబర్‌లో ఇస్లామాబాద్‌లో జరిగిన SCO సమావేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా హాజరైన సంగతి తెలిసిందే.