ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇది కరోనా లాంటి ఒక పెను విపత్తు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన కీలక రివ్యూ మీటింగ్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో రిజర్వాయర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రాజెక్టుల్లో 20 శాతం కూడా నీటి నిల్వలు లేవని సీఎం స్పష్టం చేశారు. “వచ్చే నాలుగు నెలలు సాగునీరు అందించడం అసాధ్యం. తాగడానికి నీళ్లు లేనప్పుడు పంటలకు నీళ్లు ఎలా ఇస్తాం? తాగునీటి అవసరాలు తీర్చడమే మా ఫస్ట్ ప్రయారిటీ. ఇది క్యాన్సర్ లాంటి చేదు నిజం, ప్రజలకు వాస్తవాలు ముందే చెప్పాలి” అని తేల్చిచెప్పారు. మహారాష్ట్ర వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనూ 20 శాతం వాటర్ కట్ విధించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 20 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ రికార్డయిందని, అధిక ధర చెల్లించినా మార్కెట్లో పవర్ దొరకని పరిస్థితి ఉందని రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పగటి పూట ఫ్యాన్లు, ఏసీల వాడకం తగ్గించాలని, ప్రజలు కూడా సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేస్తూ విద్యుత్‌ను ఆదా చేయాలని పిలుపునిచ్చారు.

సంక్రాంతి పండుగ తర్వాత నుంచి మే నెలాఖరు వరకు ప్రజాప్రతినిధులంతా గ్రామాల బాట పట్టాలని సీఎం ఆదేశించారు. లీడర్ల పనితీరును ఒక ప్రత్యేక మానిటరింగ్ యాప్ ద్వారా ట్రాక్ చేస్తామన్నారు. గ్రామాల్లో సమ్మర్ వర్క్స్, ఉపాధి హామీ కింద మట్టి పనులకు స్పెషల్ ఫండ్స్ కేటాయించి ప్రతి ఒక్కరికీ పని, అన్నం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు కాదని, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలపై ఎల్‌నినో ప్రభావం ఉందని సీఎం చెప్పారు. కేసీఆర్ హయాంలో కట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నీళ్లు ఫామ్‌హౌస్‌కు, నిధులు బీఆర్‌ఎస్ ఖాతాకు చేరాయని విమర్శిస్తూ.. విపక్షాల ఫేక్ ప్రచారాన్ని నేతలు ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.