
Microsoft : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లలో కనీవిని ఎరుగని రీతిలో రికార్డు సృష్టించింది. గురువారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ మార్కెట్ విలువ కేవలం ఒక్క రోజే ఏకంగా 450 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.42లక్షల కోట్లకు పైమాటే) పెరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక కంపెనీ మార్కెట్ విలువ ఒకే రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక రికార్డుతో మైక్రోసాఫ్ట్ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ 3.35 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
గతేడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచదేశాలపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో చిప్ కంపెనీ ఎన్విడియా మార్కెట్ విలువ ఒక్క ట్రేడింగ్ సెషన్‌లో 440 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. నాడు ఎన్విడియా నెలకొల్పిన ఈ ఘనతను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 450 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ పెరుగుదలతో అధిగమించి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించిన అద్భుతమైన త్రైమాసిక ఆర్థిక ఫలితాలే ఈ స్టాక్ పరుగుకు కారణమయ్యాయి. కంపెనీ ఆదాయం అంచనాలను మించడమే కాకుండా, అజ్యూర్ క్లౌడ్ (Azure Cloud) విభాగ ఆదాయం ఏకంగా 43 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో గురువారం అమెరికా మార్కెట్లలో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 16 శాతం మేర పెరిగాయి. మైక్రోసాఫ్ట్ షేరు విలువ ఒకే రోజులో ఈ స్థాయిలో పెరగడం 2008 తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం విశేషం.
Also Read : పాకిస్తాన్ లో కాక్రోచ్ పార్టీ… మెరుగైన పరిపాలన, పారదర్శక రాజకీయమే ఎజెండా
కంపెనీకి చెందిన ఏఐ అసిస్టెంట్ ‘మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్’కు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, దీని యూజర్ల సంఖ్య ఇప్పటికే 3 కోట్లు దాటిందని మేనేజ్‌మెంట్ వెల్లడించింది. మరోవైపు టెక్ దిగ్గజం మెటా (Meta) షేర్లు మాత్రం త్రైమాసిక ఫలితాల అంచనాలు నిరాశపరచడం, ఏఐలో పెట్టుబడులు పెరగడంతో 8 శాతం మేర కుంగాయి. దీంతో మెటా షేర్లు వరుసగా 11వ రోజు కూడా పతనాన్ని చవిచూసాయి.
క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగాల్లో ఊహించని విజయంతో మైక్రోసాఫ్ట్ రికార్డు స్థాయి ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ ఏడాది కంపెనీ వార్షిక ఆదాయం 331 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 27.7 లక్షల కోట్లు) చేరగా, ఇందులో క్లౌడ్ వ్యాపార ఆదాయం 214 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రత్యేకంగా అజూర్ క్లౌడ్ వ్యాపారం మొదటిసారిగా 100 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ తమ కంపెనీ ఆదాయం 2025లో ఈజిప్ట్ జీడీపీకి దగ్గర్లో ఉందనడం గమనార్హం. జూన్ 30 నాటికి ముగిసిన త్రైమాసికానికి నికర ఆదాయం 35.8 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థల ఆధిపత్యానికి పోటీగా సరికొత్త ఏఐ సూపర్ యాప్‌ను తీసుకురానున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటన చేశారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న కోపైలట్ చాట్‌బాట్, గిట్‌హబ్ కోడింగ్ అసిస్టెంట్, కోవర్క్, ఆటోపైలట్ సిస్టమ్‌లను ఏకీకృతం చేస్తూ ‘ఒకే ఏఐ సూపర్-యాప్’గా మార్చనున్నారు. కోపైలట్ వేగంగా సాధారణ చాట్‌బాట్ స్థాయిని దాటి సూపర్ యాప్‌గా రూపాంతరం చెందుతోందని, ఇది సాంకేతిక రంగంలో కీలక ముందడుగు అని నాదెళ్ల అభివర్ణించారు.
త్వరలో రాబోతున్న ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ ద్వారా కోడింగ్ నుంచి కార్పొరేట్ పనుల వరకు అన్నింటినీ ఒకే ఇంటర్‌ఫేస్ నుండి చాలా సులువుగా నిర్వహించవచ్చని నాదెళ్ల వివరించారు. గతంలో ఏఐ సేవల కోసం ప్రధానంగా ఓపెన్ ఏఐపై ఆధారపడిన మైక్రోసాఫ్ట్, ఇప్పుడు సొంత మోడళ్లు,చిప్‌ల అభివృద్ధితో సొంత సామర్థ్యాన్ని కూడగట్టుకుంటోంది. ఈ ఒక్క ఏడాదే 175 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 17 లక్షల కోట్లు) భారీ నిధులతో మౌలిక వసతులను విస్తరిస్తూ, ఏఐ సూపర్-యాప్ ద్వారా గ్లోబల్ టెక్ మార్కెట్‌లో తన అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.
మరోవైపు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ కూడా కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలను ప్రకటించి రికార్డు సృష్టించింది. ఈ త్రైమాసికంలో ఏకంగా 62 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభం సాధించినట్లు వెల్లడించింది. శామ్‌సంగ్ సాధించిన ఈ భారీ లాభాల సంకేతాలతో దక్షిణ కొరియా మార్కెట్ సూచీ ‘కోస్పి’ గురువారం నాటి ట్రేడింగ్‌లో బాగా పుంజుకుని 4 శాతానికి పైగా లాభాలను నమోదు చేసింది.
Also Read : టోక్యో వద్దు.. రాజధాని మార్చుకుంటున్న జపాన్.. ఎందుకో తెలుసా?









