BCCI : భారతీయ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్టు (BCCI) వార్షిక సర్వసభ్య సమావేశం ఇటీవల ముంబైలోని ప్రధానకార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రిటైర్డ్ క్రికెటర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ క్రికెటర్లకు ఒకసారి అందించే ఆరోగ్య ప్రయోజన (health benefit) మొత్తాన్ని రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.BCCI అపెక్స్ కౌన్సిల్‌లో ‘ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్’ పురుష ప్రతినిధిగా ఉన్న వి.చాముండేశ్వరనాథ్ చేసినఈ ప్రతిపాదనను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఈ ప్రయోజనం అందరికీ అందనుంది.

“గతంలో, 10 లేదా అంతకంటే ఎక్కువ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులుగా ఉండేవారు. అయితే తాజా నిర్ణయంతో అక్టోబర్ 1 నుండి, వారు రూ. 15 లక్షలు పొందేందుకు అర్హత సాధిస్తారు,” అని చాముండేశ్వరనాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

అంతేకాక, 25 లేదా అంతకంటే ఎక్కువ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు నెలకు రూ. 30,000 పెన్షన్ అందించే BCCI ‘గ్రాటిస్’ (Gratis) పథకంలో, 5 నుండి 24 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారిని కూడా చేర్చాలని చాముండేశ్వరనాథ్ ఈ సందర్భంగా జాతీయ క్రికెట్ బోర్డును కోరారు. “దీనిపై BCCI అపెక్స్ కౌన్సిల్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే BCCI నుండి వారికి అందే వార్షిక నిధుల ద్వారా దీనిని అమలు చేయాలని అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బోర్డు ఈ మేరకు సూచనలు పంపుతుంది,” అని చాముండేశ్వరనాథ్ స్పష్టం చేశారు. అలాగే, “ఇప్పటికే 15 రాష్ట్ర సంఘాలు ఈ వర్గానికి చెందిన ఆటగాళ్లకు చెల్లింపులు చేస్తున్నాయి. ఉదాహరణకు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కనీసం ఒక్క రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన పురుష క్రికెటర్లకు కూడా నెలకు రూ. 10,000 పెన్షన్ ఇస్తోంది,” అని ఆయన గుర్తు చేశారు.

కాగా “క్రికెటర్ల ప్రయోజనం కోసం తను చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించినందుకు మాజీ BCCI అధ్యక్షుడు , ప్రస్తుత ICC చైర్మన్ జై షా, BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా, ఇతర BCCI అధికారులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను,” అని ఈ సందర్భంగా చాముండేశ్వరనాథ్ పేర్కొన్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.