Smit Machchhar :  ఫ్లైదుబాయ్ విమానాన్ని పెను ప్రమాదం నుంచి కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆయన చూపించిన ధైర్యం, ఓర్పు, సమయస్ఫూర్తిని మోదీ ప్రశంసించారు. స్మిత్ మచ్ఛర్ వల్ల ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయని పీఎం కొనియాడారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న స్మిత్ మచ్ఛర్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ.. మీ ధైర్యం, ఓర్పు, సమయస్ఫూర్తి ఎంతో మంది ప్రాణాలను కాపాడాయి అని అన్నారు. మీకు తీవ్ర గాయాలయ్యాయి. మీ ప్రాణాల కోసం మీరు పోరాడుతున్నారు. అయినా మీ ప్రాణాల గురించి ఆలోచించకుండా విమానంలోని ప్రయాణికుల ప్రాణాల గురించి ఆలోచించారు అని ప్రశంసించారు. మీ వల్ల 140 కోట్ల మంది భారతీయులు గర్వపడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. స్మిత్ మచ్ఛర్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు చెందిన వ్యక్తి.

తనకు ఎదురైన పరిస్థితిని కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రధాని మోదీకి వివరించారు. నాకు చాలా గాయాలయ్యాయి. నేను కింద పడిపోయానని చెప్పిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. నేను 17 ఏళ్లుగా విమానాలు నడుపుతున్నాను. గత 11 ఏళ్లుగా కెప్టెన్‌గా పనిచేస్తున్నాను. కళ్లు మూసుకున్నా విమానం పరిస్థితి ఎలా ఉందో నాకు అర్థమవుతుంది. నేను కింద పడిపోయిన సమయంలో కూడా విమానం వేగంగా కిందికి వెళ్తున్న విషయం నాకు అర్థమైంది అని చెప్పారు.

Also Read : ఏంటి నిజమా? బ్యాంకులకు ప్రతి శనివారం సెలవా?.. నిజమెంత?

తనకు భయం వేసినప్పుడు హనుమాన్ చాలీసా చదువుతానని ఆయన ప్రధానికి చెప్పారు. నాకు ఎప్పుడైనా భయం వేసినా హనుమాన్ చాలీసా చదువుతాను. ఆ సమయంలో కూడా అదే చదువుతూ ఉన్నాను. దేవుడే నన్ను కాపాడాడని నాకు తెలుసు అని అన్నారు. తన రెండేళ్ల కుమారుడికి కూడా ప్రతిరోజూ ఉదయం హనుమాన్ చాలీసా చదివి వినిపిస్తానని స్మిత్ మచ్ఛర్ చెప్పారు. మన దేశానికి దూరంగా ఉన్నా మన సంస్కృతికి దూరం కాకూడదు అని అన్నారు. అంతకుముందు స్మిత్‌ కుటుంబసభ్యులతో మోదీ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆయనకు అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రస్తుతం స్మిత్‌ యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. స్మిత్ మచ్ఛర్ ఇటీవల ముంబై నుంచి దుబాయ్‌కు వెళ్లి అక్కడ పనిచేయడం ప్రారంభించారు.

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ అయిన ఒమన్ దేశానికి చెందిన వ్యక్తి కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో కో-పైలట్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించగా స్మిత్ అడ్డుకున్నాడు. కాక్‌పిట్‌లో నుంచి శబ్దాలు రావడంతో ప్రయాణికులు, సిబ్బంది అక్కడికి పరుగెత్తారు. కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఆ సమయంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. విమానంలో 170 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు ఫ్లైదుబాయ్ పైలట్లు కాక్‌పిట్ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Also Read : రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.