Young Tamil Hero’s : తమిళ సినీ పరిశ్రమ (కోలీవుడ్) కథానాయకులకు, తమిళనాడు రాజకీయాలకు ఎప్పటినుంచో విడదీయరాని అనుబంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత, విజయ్‌కాంత్ వంటి ఎందరో దిగ్గజాలు వెండితెర వేదికగా సాధించిన ప్రజాదరణను రాజకీయ బలంతో జోడించి సంచలనాలు సృష్టించారు. అదే దారిలో తమిళ నటులు కొందరు ఇప్పుడు రాజకీయ అరంగేట్రంపై తీవ్రంగా దృష్టి సారిస్తున్నారు. రాబోయే రోజుల్లో తాము ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నామంటూ వివిధ కార్యక్రమాల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో, తమిళనాడు రాజకీయ వర్గాల్లోనూ , అభిమానులలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఈ సరికొత్త రాజకీయ చైతన్యానికి నటుడు విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయమే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్ హీరోగా తన కెరీర్ అత్యున్నత శిఖరాల్లో ఉన్న సమయంలోనే విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరిట స్వంత రాజకీయ పార్టీని స్థాపించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అనూహ్య ప్రజాదరణ పొంది, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయి విజయం సాధించిన నేతగా చరిత్ర సృష్టించారు. విజయ్ సాధించిన ఈ అపూర్వ విజయం ప్రస్తుతం ఇతర కథానాయకులలో సైతం ఆశలను రేకెత్తిస్తూ, 2031లో జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ముందడుగు వేసేలా ప్రేరేపిస్తోంది.

Also Read : BMW సంచలన నిర్ణయం.. 8 వేల మంది ఉద్యోగులు ఔట్!

బర్త్‌ డే వేదికగా రాజకీయ ప్రసంగం – ధనుష్‌

ఈ రేసులో ప్రముఖ నటుడు ధనుష్ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల తిరువళ్లూర్ జిల్లా పెరియపాళయం సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాల ప్రాంగణంలో తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన ధనుష్, అక్కడ తన అభిమాన సంఘానికి ప్రత్యేక జెండాను ఆవిష్కరించారు. ఆ వేదికపై ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగం కేవలం అభిమానులను ఉద్దేశించినది కాదని, అది పక్కా పొలిటికల్ ఎంట్రీకి సంకేతమేనని విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. ధనుష్ తన అభిమాన బలగాన్ని కేవలం సినిమా ప్రచారానికే కాక ఒక బలమైన రాజకీయ పునాదిగా మలచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.

ధనుష్ ఎంచుకునే చిత్రాల ఇతివృత్తాలు కూడా ఆయన సామాజిక, రాజకీయ కోణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఆయన నటించిన ‘వేలయిల్లా పట్టధారి’ (నిరుద్యోగ సమస్య), ‘అసురన్’ (భూహక్కులు, కులవివక్ష), ‘కర్ణన్’ (పోలీసుల అరాచకం, కుల రాజకీయాలు), ‘కొడి’ (ప్రత్యక్ష రాజకీయాలు) ,’వాత్తి’ (విద్యా వ్యవస్థలోని రాజకీయాలు) వంటి సినిమాలు సమాజంలోని ప్రధాన సమస్యలను స్పృశించాయి. ఇవన్నీ ధనుష్ రాజకీయ అరంగేట్రానికి ఒక పటిష్టమైన భావజాల పునాదిని వేశాయని భావిస్తున్నారు.

ధనుష్ రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్య వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కి వ్యక్తిగత జ్యోతిష్యుడైన రిక్కి రాధన్ పండిట్ వెట్రివేల్ ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడారు. ధనుష్ రాజకీయాల్లోకి వస్తే ఆయన రెండో అతిపెద్ద శక్తిగా ఎదుగుతారని, అప్పుడు విజయ్‌కి – ధనుష్‌కి మధ్యే ప్రధాన పోటీ నెలకొంటుందని పేర్కొన్నారు. ధనుష్ రాకతో దశాబ్దాలుగా ఏలుతున్న డిఎంకె, అన్నాడిఎంకె ల రాజకీయ భవిష్యత్తు పూర్తిగా తారుమారవుతుందని ఆయన జోస్యం చెప్పారు.

మంచి చేయడానికే రాజకీయాల్లోకి – విశాల్‌

మరోవైపు యాక్షన్ హీరో విశాల్ సైతం తన రాజకీయ అకాంక్షను బహిరంగంగానే వెల్లడించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ.. ఇకపై తన ప్రయాణం సాధారణంగా ఉండదని, సంపూర్ణ నిజాయితీతో ప్రజలకు సేవ చేయడమే తన తదుపరి లక్ష్యమని తెలిపారు. గతంలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీకి యత్నించారు. 2017 ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయగా సాంకేతిక కారణాలతో అది తిరస్కరణకు గురైంది. “మంచి చేయడమే రాజకీయమైతే, నేను ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చినట్లే” అని గతేడాది ప్రకటించిన విశాల్, 2031 ఎన్నికల నాటికి పూర్తిస్థాయి ప్రణాళికతో రానున్నట్లు సంకేతాలిచ్చారు.

Also Read : భారత్‌లో నిజంగానే ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ అవుతోందా?.. సంచలనం రేపుతున్న వార్తపై అసలు నిజం ఇదే!

సేవా కార్యక్రమాలతో ముందడుగు – లారెన్స్‌

ఈ రాజకీయ రేసులోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ ఊహించని విధంగా తెరపైకి వచ్చారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు జూన్ నెలలో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, దీనిపై ప్రజల అభిప్రాయాలను ఆహ్వానించారు. అయితే, రాజకీయ ప్రవేశంపై ప్రజల అభిప్రాయాలు కోరడం ఏమిటని, రావాలనుకుంటే నేరుగా రావచ్చు కదా అని ఆయనపై విమర్శలు వచ్చాయి. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో లారెన్స్ ఇచ్చిన వివరణ వివాదాస్పదమైంది. కాగా, తిరుచ్చి ఈస్ట్ శాసనసభ ఉప ఎన్నికల్లో లారెన్స్ విజయ్ నేతృత్వంలోని టీవీకే తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జరగ్గా, ఆయన ఆ వార్తలను ఖండించారు.

మొత్తానికి, ఎంజీఆర్ నాటి నుండి నేటి విజయ్ వరకు తమిళనాడులో వెండితెర వెలుగులు రాజకీయ అధికారానికి రాజమార్గాలుగా మారుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ధనుష్, విశాల్, లారెన్స్ వంటి కథానాయకులు పంపుతున్న సంకేతాలు తమిళనాడు రాజకీయ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తున్న ప్రధాన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి స్వస్తి పలికి, 2031 నాటికి కొత్త తరం సినీ తారలు తమిళ రాజకీయాన్ని ఏ విధంగా తిరగరాస్తారో వేచి చూడాల్సిందే!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.