CJP Protests : భారత చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌(సీఈసీ) రాజీనామా కోరుతూ కాక్రోచ్‌ జనతా పార్టీ(CJP) అక్టోబరు 2న ముంబయిలో తల పెట్టిన ఆందోళనకు ముంబయి పోలీసులు అనుమతి నిరాకరించారని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది. అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సీజేపీ ముంబైలో చేపట్టిన నిరసనకు అనుమతి ఇవ్వకపోతే “జైల్ భరో ఆందోళన్” చేపడతామని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. పౌరులు తమ గళాన్ని వినిపించకుండా అడ్డుకునే మరో ప్రయత్నమే పోలీసుల నిర్ణయమని దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నిరసన తెలిపే హక్కును నిరాకరిస్తే, గాంధీ జయంతి రోజున ముంబైలో CJP “జైల్ భరో ఆందోళన్” చేపడుతుందని ఆయన Xలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. CJP పోలీసు అధికారుల మధ్య ఇటీవల నెలకొన్న విస్తృత వివాదం నేపథ్యంలో గాంధీజయంతి రోజున చేపట్టనున్న నిరసనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల తమ సహ-కన్వీనర్ ఆశుతోష్ రంకా, అలాగే పలువురు కార్యకర్తలను అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని CJP ఆరోపించింది.

CJP చేసిన ఆరోపణల ప్రకారం, రంకాతో పాటు సుమారు 40 మంది సీజేపీ కార్యకర్తలను గువాహటిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారో కారణం చెప్పలేదని పార్టీ ఆరోపించింది. అసోం జాతీయ పరిషత్ (AJP) ప్రతిపక్ష నేత కుంకి చౌధురిని కలిసేందుకు రాష్ట్ర సచివాలయానికి సమీపంలో ఉన్న డిస్పూర్ ప్రాంతంలోని నివాసానికి CJP కార్యకర్తలతో కలిసి రంకా అసోం వెళ్లారు. అయితే ఆ సమావేశాన్ని నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారని దీప్కే ఆరోపించారు. “అసోం పోలీసులు ఆశుతోష్ రంకా,CJP బృందాన్ని అదుపులోకి తీసుకుని, తెలియని ప్రదేశానికి తరలిస్తున్నారు. ఆశు,ఇతరులు అసోంలో CJP కార్యకర్తలతో చిన్న సమావేశం నిర్వహించేందుకు వెళ్లారు” అని దీప్కే అంతకుముందు సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

మరో పోస్టులో, రంకాను ఒక ప్రైవేట్ నివాసం నుంచి పోలీసులు తీసుకెళ్లారని, తనతో పాటు ఇతర కార్యకర్తలకు కూడా ఎలాంటి ఆరోపణలు లేదా నిర్బంధానికి గల కారణాలను తెలియజేయలేదని ఆయన ఆరోపించారు.“ఆశును విడుదల చేయకపోతే, నేను ఇతర CJP సభ్యులతో కలిసి అసోం వెళ్తాను. (ముఖ్యమంత్రి) హిమంత (బిశ్వ శర్మ) మమ్మల్ని అందరినీ అరెస్టు చేయవచ్చు” అని దీప్కే అన్నారు. రంకా X ఖాతాలో పోస్టు చేసిన ఒక వీడియోలో, ఆయన కదులుతున్న పోలీసు వాహనంలో కూర్చుని కనిపించారు. CJP ప్రణాళికల గురించి ఆయన చెబుతారనే భయంతోనే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ చర్యకు ఆదేశించారని రంకా ఆరోపించారు.

పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడిన రంకా, ముఖ్యమంత్రి “బయటపడతామనే భయంతో” ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.“ఇక్కడి పాఠశాలలను చూపిస్తే దేశానికి వాస్తవ పరిస్థితి తెలుస్తుందనే భయం ఆయనకు ఉంది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కాజిరంగా ప్రాంతంలో ప్రజల హక్కులు ఎలా హరించబడుతున్నాయో ప్రజలకు తెలుస్తుందనే భయం ఉంది. అలాగే, మనుషుల చర్యల వల్ల ఏర్పడిన వరదలు అనేక మంది ప్రాణాలను బలిగొన్నాయి.“అయితే, మాకు ఆయనంటే భయం లేదు. నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజించడం ద్వారా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారని మాకు తెలుసు” అని రంకా తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

Also Read : తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. నాలుగేళ్ల రూల్స్ పై క్లారిటీ

CJP ఆరోపణలకు NCP (SP) మద్దతు

తరువాత NCP (SP) అధికార ప్రతినిధి అనిష్ గావాండే మాట్లాడుతూ, “CJP కార్యకర్తలతో సమావేశం జరగాల్సి ఉన్న సమయంలో రంకా, మరో 41 మందిని ఒక ప్రైవేట్ నివాసం నుంచి చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారు” అని ఆరోపించారు.ఆ బృందానికి ఎలాంటి చట్టపరమైన నోటీసు ఇవ్వలేదని, తమపై ఏ చట్టంలోని సెక్షన్లు విధించారో కూడా వారికి తెలియజేయలేదని గావాండే ఆరోపించారు. “ముఖ్యమంత్రి శర్మ అసమ్మతిని చూసి భయపడుతున్నారు. ఆయన పాలనలో ఇది అక్షరాలా జంగిల్ రాజ్‌కి ఏమాత్రం తక్కువ కాదు” అని గావాండే అన్నారు.పాఠశాలల పరిస్థితి, కాజిరంగాలో జరుగుతున్న బహిష్కరణలు, కార్యకర్తల అరెస్టులు, ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజన వంటి అంశాలను CJP లేవనెత్తాలని ప్రణాళిక వేసిందని ఆయన తెలిపారు.

“ఇది అసోంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక విధానం. కార్యకర్త ప్రణబ్ దోలే బెయిల్ పొందిన వెంటనే మళ్లీ అదుపులోకి తీసుకుంటున్నారు, ఆయనపై జాతీయ భద్రతా చట్టం (NSA) కూడా ప్రయోగిస్తున్నారు” అని గావాండే అన్నారు. కాజిరంగాలో స్థానిక ప్రజల హక్కుల కోసం జరిగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన కార్యకర్తను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.“అసోంలో పౌర సమాజం, కార్యకర్తలను భయపెట్టి, ఒక పోలీసు రాజ్యాన్ని సృష్టించేందుకు చేస్తున్న మరో ప్రయత్నమే ఇది” అని ఆయన ఆరోపించారు.“రంకా, ఇతరులందరినీ వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అసోం పోలీసులపై, అలాగే ఈ చట్టవిరుద్ధ చర్యకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి సహా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని గావాండే తెలిపారు.

Also Read : పసిడి ప్రియులకు ఊరట.. దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములపై నేడు ఎంత తగ్గిందంటే?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.