Cockroach Janta Party : రాజకీయ రంగంలో డిజిటల్ మీడియా తెస్తున్న మార్పులకు నిదర్శనంగా ‘కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP)’ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఎన్నికల కమిషన్ వద్ద నమోదు కాకపోయినప్పటికీ, కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ జెన్-జీ (Gen-Z) ఆన్‌లైన్ ఉద్యమం ఏకంగా 2 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను అతితక్కువ సమయంలో దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక సాధారణ డిజిటల్ ప్రచారంగా మొదలై, చివరకు కేంద్ర మంత్రితో రాజీనామా చేయించేంత స్థాయికి ఈ ఉద్యమం ఎదగడం విశేషం.

ఈ ఉద్యమం ప్రారంభానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణమయ్యాయి. “కొందరు యువత బొద్దింకల్లాంటివాళ్లు. ఉద్యోగాలు, వృత్తులు లేకుండా పాత్రికేయులు, సామాజిక మాధ్యమ కార్యకర్తలు, ఆర్టీఐ ప్రచారకర్తలుగా మారి అందరిపైనా దాడులు చేస్తారు” అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ, బోస్టన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఆప్ మాజీ కార్యకర్త అయిన అభిజీత్ దీప్కే మే 16న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ఆన్‌లైన్ ప్రచారాన్ని చేపట్టగా, అనతికాలంలోనే లక్షలాది మంది యువత ఇందులో భాగస్వాములయ్యారు.

ప్రస్తుతం ఈ సీజేపీకి 10 మంది ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. అభిజీత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోశ్ రంకా, విజేత దహియా, ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, అమూల్య ధవన్, రోనక్ ఖత్రీ , అర్పిత్ శర్మలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. భావసారూప్యత కలిగిన వివిధ రంగాల ప్రముఖులు ఒకే వేదికపైకి రావడం వల్ల ఈ డిజిటల్ ఉద్యమానికి యువత నుంచి అపరిమితమైన మద్దతు లభించింది.

ఈ జెన్-జీ ఉద్యమం కేవలం నిరసనలకే పరిమితం కాకుండా తమదైన శైలిలో ఒక సంచలన మ్యానిఫెస్టోను కూడా ప్రకటించింది. సీజేఐలతో సహా ఏ ప్రధాన న్యాయమూర్తికీ పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకూడదని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఓట్లు తొలగిస్తే సీఈసీని యూఏపీఏ (UAPA) కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, చట్టసభల్లోనూ ,మంత్రివర్గంలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వ్యాపారవేత్తలు అంబానీ, అదానీల మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయాలని తమ మ్యానిఫెస్టోలో పొందుపరిచారు.

రాజకీయ స్థిరత్వం కోసం ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేపీ కోరింది. పార్టీ మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ,ఎలాంటి పదవులూ చేపట్టకుండా పూర్తిస్థాయి నిషేధం విధించాలని స్పష్టం చేసింది. సీజేఐ వ్యాఖ్యలతో రగిలిన ఆగ్రహం, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, వ్యవస్థల్లో పారదర్శకత లోపించడం వంటి సమస్యలపై యువతలో ఉన్న అసంతృప్తికి ఈ మ్యానిఫెస్టో ఒక బలమైన గొంతుకగా మారింది.

సోషల్ మీడియా నుంచి వీధి పోరాటాల వైపు ఈ ఉద్యమం వేగంగా విస్తరించింది. జూన్ 6న అభిజీత్ దీప్కే అమెరికా నుంచి రాగానే జంతర్ మంతర్ వద్ద వేలాదిగా యువత మోహరించారు. డిజిటల్ ప్రచారంతో పాటు జూన్ 20న జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించగా, జూన్ 22 నుంచి 27 వరకు వేలాదిమంది ఆందోళనల్లో పాల్గొన్నారు. జూన్ 28న సోనమ్ వాంగ్‌చుక్ నేరుగా వచ్చి నిరాహారదీక్ష ప్రారంభించడంతో ఈ నిరసన మరింత ఉద్ధృత రూపం దాల్చింది. సాంకేతికతను ఆయుధంగా చేసుకుని డిజిటల్ వేదికల ద్వారా వ్యవస్థలను సైతం ప్రశ్నించవచ్చని ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం చాటిచెప్పింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.