
ఢిల్లీలో దీపావళి తర్వాత వాయు కాలుష్యం(Dangerous Pollution) ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత సూచీ 400 దాటి అత్యంత తీవ్రమైన కేటగిరీకి చేరుకోవడంతో నగర ప్రజలు విషపూరితమైన గాలిని పీల్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గాలి వేగం తగ్గడం, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ విషపూరిత కణాలు వాతావరణంలోనే నిలిచిపోయాయి. ప్రమాదకరమైన PM2.5 కణాల స్థాయిలు సాధారణం కంటే ఏకంగా 62 రెట్లకు పైగా పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ పరిస్థితి సులువుగా మారే సంకేతాలు కనిపించడం లేదు. అయితే పొల్యూషన్ వల్ల ప్రజలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. ఈ కాలుష్యమైన పొగను పీల్చడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : ‘అందుకే ప్రధాని పదవి వద్దనుకున్నా’: ఆత్మకథలో సోనియా గాంధీ సంచలనం
శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం
కలుషిత గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా గాలిలోని పిఎమ్ 2.5 కణాలు చాలా సన్నగా ఉండటంతో అవి నేరుగా ఊపిరితిత్తులలోకి, రక్తం లోపలికి చేరుకుంటాయి. దీనివల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు కూడా దగ్గు, గొంతు మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడతాయి.
హృదయ సంబంధ వ్యాధులు
విషపూరిత కణాలు రక్తంలో కలవడం వల్ల రక్తం చిక్కబడి రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఇది గుండెపోటు, అధిక రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. దీర్ఘకాలంగా ఈ వాతావరణంలో ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో మరణించే వారి సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కళ్ల మంటలు, చర్మ సమస్యలు
పొగమంచు, కాలుష్య కణాలు వాతావరణంలో పేరుకుపోవడం వల్ల కళ్లలో తీవ్రమైన మంట, ఎర్రబడటం, నీరు కారడం వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. అంతేకాకుండా ఈ రసాయన కణాలు చర్మానికి తగలడం వల్ల చర్మం పొడిబారడం, దురదలు, రాషెస్ వంటి రకరకాల చర్మ వ్యాధులు వస్తాయి.
మానసిక ఆరోగ్యం
కలుషిత గాలి కారణంగా మెదడుకు సరిపడా ప్రాణవాయువు అందక తలనొప్పి, కళ్లు తిరగడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా రోడ్డుపై కాలుష్యం వల్ల కంటిచూపు తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఉదయం పూట పొగమంచు, కాలుష్యం కలవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.
Also Read : వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్.. బ్లూ టిక్స్ పడకుండానే మెసేజ్ చదవచ్చు.. ఎలాగంటే?
రోగనిరోధక శక్తి తగ్గిపోవడం
ఈ విషపూరిత గాలిని ప్రతిరోజూ పీల్చడం వల్ల శరీరంలోని సహజ రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం ఢిల్లీలో ఒక్క రోజు పీల్చే గాలి సుమారు 15 నుండి 20 సిగరెట్లు తాగడంతో సమానం. దీనివల్ల బాడీ ఇమ్యూనిటీ తగ్గి, అనేక ఇన్ఫెక్షన్లు త్వరగా దాడి చేస్తాయి. దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్కు కూడా ఇది దారితీస్తుంది.









