
మీ వెహికల్‌లో పెట్రోల్ కొట్టించిన ప్రతిసారీ మైలేజ్ తగ్గిపోతోందా? ఇంజిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా?.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే E20 ఫ్యూయల్. ఒకవైపు E20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్నాయని, మైలేజ్ పడిపోతోందని వాహనదారులు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు ఈ పాలసీ వెనుక పెద్ద కుట్ర ఉందంటూ ప్రచారం నడుస్తోంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఫ్యామిలీకి దీని ద్వారా కోట్ల రూపాయల లాభం చేకూరుతోందంటూ డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించిన నితిన్ గడ్కరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్స్, గూగుల్ లాంటి టాప్ సోషల్ మీడియా కంపెనీలపై కేసు వేసేందుకు కోర్టు మెట్లు ఎక్కనున్నారు.
అసలు ఏంటి ఈ E20 పాలసీ? గడ్కరీ వర్సెస్ సోషల్ మీడియా లీగల్ వార్ ఏంటి ? అలాగే పేపర్ లీక్స్‌పై వచ్చిన ‘CJP’ తరహాలోనే ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ‘E20 జనతా పార్టీ’ డిమాండ్స్ ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం.
ముందుగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారో, ఆయన ఆరోపణలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో E20 Fuel పాలసీపై భారీ ఎత్తున నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా AIతో క్రియేట్ చేసిన డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియో క్లిప్‌లు వైరలవుతున్నాయి. ఈ వీడియోల్లో నితిన్ గడ్కరీ, ఆయన కుటుంబం E20 పాలసీ వల్ల ఆర్థికంగా భారీగా లబ్ధి పొందుతున్నారనే కోణంలో పోస్టులు పెట్టారు. ఈ దుష్ప్రచారంపై నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. తన పరువుకు తీవ్ర నష్టం కలిగించేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఫేక్ కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. గడ్కరీ వాదనను పరిశీలించిన బాంబే హైకోర్టు.. మెటా, ఎక్స్, గూగుల్ తో పాటు ఆ కంటెంట్‌ను తయారు చేసిన వారిపై సివిల్ దావా వేయడానికి నితిన్ గడ్కరీకి పర్మిషన్ ఇచ్చింది. ఈ కేసులో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్స్ విభాగాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చారు.
మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై నితిన్ గడ్కరీ కూడా క్లారిటీ ఇచ్చారు. E20 పాలసీ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావన్నారు. ఈ పాలసీని రూపొందించడం, అమలు చేయడం మొత్తం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని చెప్పారు. రవాణా మంత్రిగా ఉన్న తనకు లేదా తన కుటుంబానికి ఈ పాలసీ ద్వారా వ్యక్తిగత లబ్ధి చేకూరుతుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం అని తేల్చిచెప్పారు.
ఇంతకీ ఈ E20 పెట్రోల్ అంటే ఏంటి? ప్రభుత్వం దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తూ ప్రమోట్ చేస్తోంది? దీనివల్ల లాభ, నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : UPI యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ నంబర్లు కనిపించవు!
80 శాతం సాధారణ పెట్రోల్, 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్నే E20 Fuel అంటారు. ఇథనాల్ అనేది ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, ధాన్యం వ్యర్థాల నుండి తయారుచేసే ఒక బయో ఫ్యూయల్. ప్రస్తుతం భారత్ తన చమురు అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఎక్కువగా డిపెండ్ అవుతోంది. ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, అలాగే కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడటమే కేంద్ర ప్రభుత్వం మెయిన్ టార్గెట్.
కానీ E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందని, పాత వాహనాలు పాడవుతున్నాయని తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ కూడా ఇటీవలే రెస్పాండ్ అయ్యింది. E20 వల్ల వాహనాల మైలేజ్ 3 నుంచి 5 శాతం తగ్గుతుందని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇథనాల్ తయారీ ద్వారా వ్యవసాయ రంగానికి, రైతులకు అదనపు ఆదాయం వస్తుందని.. అలాగే విదేశీ మారక నిల్వలు కూడా ఆదా అవుతున్నాయని చెప్పుకొచ్చింది.
Also Read : పరారీకి ప్రయత్నించిన గ్యాంగ్ రేప్ నిందితులు.. కస్టడీలోనే ప్రజల దాడి
సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్‌లో ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. దీనివల్ల వాహనాల మైలేజ్ 6 నుంచి 10 శాతం పడిపోతుందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పాత వాహనాలు అంటే BS4 లేదా అంతకంటే పాత ఇంజిన్లు E20 ఫ్యూయల్‌కి అనుకూలంగా ఉండటం లేదని అంటున్నారు. ఇథనాల్‌లోని తేమ వల్ల ఇంజిన్ రబ్బర్ విడిభాగాలు దెబ్బతినడం, రస్ట్ వంటి సమస్యలు వచ్చి ఇంజిన్ త్వరగా పాడవుతుందని వాదిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం E20 Fuel విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. కొత్తగా వస్తున్న వాహనాలన్నీ E20 కి తగ్గట్లుగానే ఉంటున్నాయని.. పాత వాహనాలకు కూడా స్వల్ప మార్పులు చేస్తే ఇది సురక్షితమేనని అధికారులు చెబుతున్నారు.
ఇటీవల NEET పేపర్ లీక్స్‌కు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ అయ్యి, పెద్దఎత్తున నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో ‘E20 జనతా పార్టీ’ అనే పేరుతో కూడా ఇదే ట్రెండ్ మొదలైంది. వాహనదారులపై బలవంతంగా E20 Fuelని రుద్దకూడదని అంటున్నారు. ప్రతి పెట్రోల్ బంక్‌లో 100 శాతం అసలైన, ఇథనాల్ కలపని పెట్రోల్‌ను ఎంచుకునే స్వేచ్ఛ వాహనదారులకే ఇవ్వాలని కోరుతున్నారు. E20 పాలసీ ఫెయిల్ అయ్యిందని.. నితిన్ గడ్కరీ కూడా రాజీనామా చేయాలంటూ నెటిజన్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
చూశారుగా.. E20 ఫ్యూయల్ పాలసీపై జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ. ఒకవైపు పర్యావరణం, ఆర్థిక ఆదా కోసం ప్రభుత్వం E20 పాలసీని తీసుకొస్తే.. మరోవైపు మైలేజ్ తగ్గిపోతుందని, ఇంజిన్ పాడవుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు సోషల్ మీడియాలో నితిన్ గడ్కరీపై ఫేక్ న్యూస్‌లు, డీప్‌ఫేక్ వీడియోలు రావడం ఇప్పుడు చర్చనీయమవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీ వాహనంలో E20 పెట్రోల్ వాడుతున్నారా ? మైలేజ్‌లో ఏమైనా తేడా వచ్చిందా? అలాగే నితిన్ గడ్కరీ రాజీనామా చేయడం కరెక్టే అంటారా ? కింద కామెంట్ చేయండి.









