
Rajasthan : కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా దాచుకుందామనుకున్న ఒక రైతు తెలివితక్కువ పని వల్ల ఏకంగా రూ. 5 లక్షలు చెదలు పట్టి బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బలోత్రా జిల్లా, పంచపద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని నెవాయ్ గ్రామానికి చెందిన మాంగీలాల్ మేఘ్వాల్ అనే రైతు ఏడాది క్రితం తన ప్లాట్‌ను అమ్మగా వచ్చిన రూ. 5 లక్షల డబ్బును భద్రపరచాలనుకున్నాడు.
Also Read : అయోధ్య రామమందిరానికి కొత్త CEO.. రేసులో 18 మంది!
వ్యసనాలకు అలవాటుపడిన మాంగీలాల్, ఆ డబ్బు అనవసరంగా ఖర్చయిపోతుందో, తన కొడుకులు ఆ పెద్ద మొత్తాన్ని ఖర్చు పెడతారేమోనని భయంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి, తన 10 బిగాల పొలంలో ఒక చోట గుంత తవ్వి పాతిపెట్టాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఇల్లు కట్టుకోవడానికి డబ్బు అవసరమై తోటకు వెళ్లి చూడగా, ఆ డబ్బు ఎక్కడ పాతిపెట్టాడో అతనికి గుర్తుకు రాలేదు. చివరకు ఇంట్లో విషయం చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి పొలమంతా తవ్వినా లాభం లేకపోయింది.
ఇలా ఏడాది సమయం గడిచాక, ఇటీవల కురిసిన వర్షాలకు నేల వదులై ఆ ప్లాస్టిక్ కవర్ బయటకు వచ్చింది. పొలం వద్ద పనులు చేస్తున్న భార్యాపిల్లలకు అది కనిపించడంతో తెరిచి చూశారు. కానీ, అప్పటికే ఆలస్యమైంది! ప్లాస్టిక్ కవర్‌లోని రూ. 500 నోట్లను చెదలు పూర్తిగా తినేసి, ముక్కలు ముక్కలుగా మార్చేశాయి. పాడైపోయిన ఆ నోట్లను మార్చుకోవడానికి కుటుంబ సభ్యులు పంచపద్రలోని ఎస్బీఐ బ్యాంకుకు, ఆ తర్వాత బాలోత్రాలోని ప్రధాన శాఖకు వెళ్లినప్పటికీ, ఆ నోట్ల పరిస్థితి చూసి అధికారులు వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. దాచుకున్న సొమ్ము కళ్లముందే నాశనమవ్వడంతో ఆ రైతు కుటుంబం కన్నీళ్లు పెట్టకుంది.
Also Read : మెట్రోలో కీచకుడు… సీక్రెట్ గా అమ్మాయిల ఫొటోలు తీస్తూ దొరికిపోయాడు!









