
వచ్చే ఏడాది దేశంలోని ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్.. గుజరాత్.. పంజాబ్.. ఉత్తరాఖండ్.. హిమాచల్‌ప్రదేశ్.. మణిపూర్.. గోవా.. ఈ ఏడు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. అది కులం కాదు.. మతం కాదు.. రైతులు కాదు.. మహిళలు కూడా కాదు.. జెన్ జీ ఓటర్లు! అవును.. ఇప్పటివరకు ఎన్నికల్లో ప్రత్యేక ఓటు బ్యాంకులుగా మహిళలు, రైతులు, దళితులు, వెనుకబడిన వర్గాలను చూస్తూ వచ్చిన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు మరో కొత్త ఓటర్ గ్రూప్‌పై ఫోకస్ పెడుతున్నాయి. అదే Gen Z. ఎందుకంటే.. ఈసారి జెన్ జీ ఓటర్లు కేవలం యువ ఓటర్లు కాదు.. ఎన్నికల ఫలితాలను మార్చగల గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది! అసలు ఎందుకు రాజకీయ పార్టీలకు ఒక్కసారిగా జెన్ జీ గుర్తొచ్చింది? వాళ్లు ఏం కోరుకుంటున్నారు? ఈ యువ ఓటర్లు నిజంగా కులం, మతం దాటి ఓటు వేస్తారా? ఒకవేళ అలా జరిగితే.. వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎంతవరకు మారతాయి? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. రాజకీయాల్లో ఈ Gen Z గోలేంటో ఇప్పుడు చూద్దాం…
సాధారణంగా 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న యువ ఓటర్లను ఈ చర్చలో Gen Zగా పరిగణిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఈ ఏడు రాష్ట్రాల్లో.. ఈ వయసు గ్రూప్‌కు చెందిన ఓటర్లు దాదాపు 22 శాతం వరకు ఉంటారని అంచనా. అంటే.. ప్రతి వంద మంది ఓటర్లలో దాదాపు 22 మంది యువ ఓటర్లు! ఇది చిన్న సంఖ్య కాదు. ఈ ఓటర్లంతా ఒకే దిశగా కదిలితే.. ఎన్నికల ఫలితాలపై భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఈ ఏడు రాష్ట్రాల్లో మొత్తం 940 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 257 స్థానాల్లో గెలుపు మార్జిన్ 5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంది. అంటే.. చాలా నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీలకి పెద్దగా మెజారిటీ రాలేదు. ఒకవైపు 22 శాతం వరకు ఉన్న Gen Z ఓటర్లు.. మరోవైపు 5 శాతం కంటే తక్కువ మార్జిన్‌తో గెలిచిన వందలాది నియోజకవర్గాలు.. ఇవి రెండింటినీ కలిపి చూస్తే రాజకీయ పార్టీలకు ఎందుకు భయం అవుతుందో అర్థమవుతుంది. ఇటీవల పేపర్ లీక్స్‌పై ఢిల్లీలో Gen Z ప్రొటెస్ట్ చూసి పొలిటికల్ లీడర్స్‌కు భయం పుట్టింది. రీసెంట్‌గా ఝార్ఖండ్ సర్కార్ కూడా జెన్ జీ దెబ్బకు దిగి వచ్చింది. సో.. రోజురోజుకు వీళ్ల ఇంపాక్ట్ పెరుగుతోంది.
ఈ Gen Z ఓటర్లలో కేవలం 5 శాతం మంది ఒకే పార్టీ లేదా కూటమికి అదనంగా మద్దతు ఇచ్చినా.. చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల సమీకరణం మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీల లెక్కలు మారుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. దేశంలోనే అత్యధికంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 131 స్థానాల్లో గెలుస్తున్న అభ్యర్థుల మార్జిన్ 5 శాతం కంటే తక్కువగా ఉంది. అంటే 131 నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల మార్పు కూడా ఫలితాన్ని తారుమారు చేయగల పరిస్థితి.
Also Read : ఆసిమ్ మునీర్ ‘బెడ్‌రూమ్’ తో సహా పాకిస్తాన్ అణువణువుపై నిఘా ..భారత్ సకికొత్త టెక్నాలజీ
గుజరాత్‌లో 182 సీట్లలో 27 స్థానాలు.. పంజాబ్‌లో 117 సీట్లలో 24 స్థానాలు.. ఉత్తరాఖండ్‌లో 70 సీట్లలో 15 స్థానాలు.. హిమాచల్‌ప్రదేశ్‌లో 68 సీట్లలో 14 స్థానాలు.. ఇలా చాలా నియోజకవర్గాల్లో పోటీ చాలా క్లోజ్‌గా ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఒక విషయం క్లారిటీ వస్తోంది. “యువ ఓటర్లను పట్టించుకోకుండా ఎన్నికల్లో గెలవడం కష్టమవుతుందా?” అనే డౌట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు యువత గురించి రాజకీయ పార్టీలు ఏం చేసేవి? ఉద్యోగాలు ఇస్తాం.. స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తాం.. యువత కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తాం.. ఇలాంటి హామీలను మేనిఫెస్టోలో పెడితే సరిపోతుందని భావించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది.
యువతకు సంబంధించిన అంశాలు ఇక మేనిఫెస్టోలో ఒక పేజీకి పరిమితం కాకుండా.. ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉపాధి, నైపుణ్యాలు, స్టార్టప్‌లు, విద్య, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ అవకాశాలు. ఇవి ఇక యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ సందేశాలలో నేరుగా ఉపయోగించే అంశాలుగా మారవచ్చు. ఎందుకంటే Gen Z ఓటర్లు తమ ఫ్యూచర్‌గురించి ఎక్కువగా ఆలోచించే వర్గం. “మాకు ఏం ఇస్తారు?” అనే ప్రశ్నతో పాటు.. “మాకు అవకాశాలు ఎలా కల్పిస్తారు?” అనే ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడే రాజకీయ పార్టీలకు అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. కేవలం పెద్ద పెద్ద హామీలు ఇస్తే సరిపోతుందా? ఫ్రీ స్కీమ్స్ ప్రకటిస్తే యువత ఆకట్టుకుంటుందా? క్యాష్ బెనిఫిట్స్ ఇస్తే ఓటు మారుతుందా? అనేది ఇప్పుడు అంత సులభంగా చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే యువ ఓటర్లు స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక అవకాశాల వైపు ఎక్కువగా చూడవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అంటే.. “ఈ రోజు ఏం ఇస్తారు?” కంటే.. “రేపు నా జీవితాన్ని ఎలా మార్చబోతున్నారు?” అనేది వారికి ముఖ్యమైన ప్రశ్నగా మారవచ్చు. అదే జరిగితే రాజకీయ పార్టీల ప్రచార వ్యూహం మొత్తం మారాల్సి ఉంటుంది. ఉచితాలు కంటే ఉద్యోగాలు.. తాత్కాలిక ప్రయోజనాల కంటే స్కిల్స్.. వాగ్దానాల కంటే అమలు చేయగల పథకాలు.. ఇలాంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి రావచ్చు. ఇక Gen Z ప్రభావం కేవలం ఆర్థిక అంశాలు వరకే పరిమితం కావడం లేదు.
కులం.. మతం వంటి సంప్రదాయ రాజకీయ సమీకరణాలపై కూడా యువ ఓటర్లు ప్రభావం చూపగలరా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇప్పటివరకు భారత ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతం, వర్గం వంటి అంశాలు చాలా కీలకంగా పనిచేశాయి. కానీ సోషల్ మీడియా, ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కారణంగా కొత్త తరం రాజకీయ సమాచారాన్ని పూర్తిగా భిన్నమైన మార్గాల్లో తీసుకుంటోంది. ఒక పొలిటికల్ లీడర్ ఏం చెబుతున్నారో తెలుసుకోవడానికి TV న్యూస్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వస్తుంది.. యూట్యూబ్‌లో డిబెట్స్ కనిపిస్తుంది.. ఎక్స్‌లో పొలిటికల్ స్టేట్మెంట్ వైరల్ అవుతుంది.. షార్ట్ వీడియో ప్లాట్ ఫార్మ్స్‌లలో కొన్ని సెకన్లలో మెసేజ్ లక్షల మందికి చేరుతుంది.
అంటే.. Gen Zని చేరుకోవాలంటే ఇప్పుడు సభలు మాత్రమే కాదు.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ కూడా ఒక పొలిటికల్ వార్‌ఫేస్‌గా మారాయి! ఇదే విషయాన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తిస్తున్నాయి. ప్రధాని మోదీతో పాటు BJP నాయకులు యువతకు చేరువయ్యేందుకు ఇన్‌స్టాగ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్‌ల పై మరింత దృష్టి పెడుతున్నారు. అంటే సాంప్రదాయ పొలిటికల్ కమ్యునికేషన్‌తో పాటు సోషల్ మీడియా కమ్యునికేషన్ కూడా కీలకంగా మారుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా యువ నిరసనకారులతో తన పొలిటికల్ కనెక్ట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
Also Read : యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నారా ? మీకో షాకింగ్ న్యూస్…
అంటే యువతలో ఉన్న అసంతృప్తి, వారి సమస్యలు, వారి ఉద్యమాలను రాజకీయంగా కనెక్ట్ చేసుకునే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఇక సమాజ్‌వాదీ పార్టీ కూడా Gen Zను సీరియస్‌గా తీసుకుంటున్న సంకేతాలు ఇస్తోంది. Gen Zని ఆకట్టుకునే బాధ్యతను ఎంపీ డింపుల్ యాదవ్‌కు అప్పగించింది. దీంతో ఒక విషయం స్పష్టమవుతోంది. Gen Z ఇక పొలిటికల్ పార్టీస్‌కి “ఫ్యూచర్ ఓటర్స్” మాత్రమే కాదు.. ప్రస్తుత పొలిటికల్ టార్గెట్ గ్రూప్ కూడా! అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. ఈ Gen Z ఓటర్లు నిజంగా ఒకే రాజకీయ కూటమిగా మారతారా? ఇది మాత్రం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే Gen Z అనేది ఒకే కులానికి చెందిన వర్గం కాదు. ఒకే ప్రాంతానికి చెందిన వర్గం కాదు. ఒకే మతానికి చెందిన వర్గం కాదు. వారి ఆర్థిక నేపథ్యంలు వేరు. వారి రాజకీయ ప్రాధాన్యతలు వేరు. వారి స్థానిక సమస్యలు కూడా వేరు.
కాబట్టి Gen Z అంతా ఒకే పార్టీకి ఓటు వేస్తుందని చెప్పడం కష్టం. కానీ.. వాళ్లలో ఒకే రకమైన కొన్ని సాధారణ సమస్యలపై పెద్ద స్థాయిలో పొలిటికల్ స్టేట్‌మెంట్‌గా ఏర్పడితే మాత్రం పరిస్థితి మారిపోవచ్చు. ఉదాహరణకు జాబ్స్. ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట, ఉద్యోగ అవకాశాలు, డిజిటల్ ఫ్రీడమ్, ఫ్యూచర్ సెక్యూరిటీ.. ఇలాంటి అంశాలు పెద్ద సంఖ్యలో యువ ఓటర్లను ఒకే దిశగా ప్రభావితం చేస్తే.. అది సాంప్రదాయ ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్ద ఛాలెంజెస్ కావచ్చు. ఇదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్న విషయం. గతంలో మహిళలు ప్రత్యేక రాజకీయ బలంగా ఎదిగారు. వెనుకబడిన వర్గాలు కీలక ఓటు బ్యాంక్‌గా మారాయి. రైతులు ఎన్నికలలో ప్రధాన రాజకీయ అంశంగా నిలిచారు. దళిత ఓటర్లు కూడా అనేక రాష్ట్రాల్లో కీలక ప్రభావం చూపారు. అలాగే ఇప్పుడు.. “Gen Z కూడా ఒక కొత్త పొలిటికల్ ఓటు బ్యాంక్‌గా మారుతుందా?”
ఒకవేళ యువ ఓటర్లు కులం, మతం కంటే ఉద్యోగాలు, విద్య, భవిష్యత్తు అవకాశాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెడితే.. రాజకీయ పార్టీలు తమ పాత ఎలక్షన్ లెక్కలు మార్చాల్సిందే. కేవలం “మన కులం ఓటు మనకే” అనే లెక్కలు సరిపోకపోవచ్చు. కేవలం “మన ప్రాంతం వాడికే” అనే ప్లాన్ కూడా పనిచేయకపోవచ్చు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్న కొత్త తరం.. రాజకీయ ఎంపిక విషయంలో కూడా కొత్త లెక్కలు వేయవచ్చు. అయితే మరోవైపు రాజకీయ పార్టీలు Gen Zను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది కూడా కీలకం. సోషల్ మీడియాలో ఒక రీల్ పెట్టడం సరిపోదు. ఒక హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ చేయడం సరిపోదు. యువతకు నిజంగా నమ్మకం కలిగించాలంటే.. “మీ కోసం ఏం చేస్తాం?” అనే మాటతో పాటు.. “ఎలా చేస్తాం?” అనే సమాధానం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే వచ్చే ఎన్నికల్లో పెద్ద పొలిటికల్ టెస్ట్ కావచ్చు.
ఒకవైపు 22 శాతం వరకు ఉన్న యువ ఓటర్లు.. మరోవైపు స్వల్ప మార్జిన్‌తో ఉన్న వందలాది సీట్లు.. ఇంకోవైపు ఉపాధి, విద్య, నైపుణ్యాలు వంటి యువత సమస్యలు.. ఇవన్నీ కలిపి చూస్తే.. వచ్చే ఏడాది ఎన్నికల్లో Gen Zపై పొలిటికల్ ఫోకస్ ఎందుకు పెరిగిందో అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీల ముందు ఒక కొత్త టార్గెట్ ఉంది. యువతను కేవలం సభలకు తీసుకురావడం కాదు.. వారి ఓటును సంపాదించడం. వారి సమస్యలను కేవలం మేనిఫెస్టోలో రాయడం కాదు.. వాటికి అమలు చేయగల పరిష్కారాలు చూపించడం. సోషల్ మీడియాలో కనిపించడం మాత్రమే కాదు.. గ్రౌండ్ లెవెల్లో కనెక్ట్ అవడం. మొత్తానికి..
వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు కేవలం బీజేపీ vs కాంగ్రెస్.. లేదా ఒక పార్టీ vs మరో పార్టీ పోటీగా మాత్రమే ఉండకపోవచ్చు. ఇది ఒక కొత్త పొలిటికల్ టెస్ట్ కూడా కావచ్చు. కులం, మతం, ప్రాంతం వంటి సంప్రదాయ ఓటు సమీకరణాల మధ్య.. Gen Z అనే కొత్త రాజకీయ శక్తి ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. 22 శాతం యువ ఓటర్లు ఒకే దిశగా కదిలితే.. 5 శాతం మార్జిన్‌తో గెలిచిన సీట్లలో రాజకీయ ఫలితాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో Gen Z ఏ పార్టీ వైపు నిలుస్తుంది? కులం, మతం లెక్కలను పక్కనపెట్టి ఉద్యోగాలు, విద్య, భవిష్యత్తుపై ఓటేస్తుందా? లేక సంప్రదాయ రాజకీయ సమీకరణాలనే కొనసాగిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం.. వచ్చే ఏడాది ఎన్నికల ఫలితాల్లోనే కనిపించనుంది.









