
Import Duty Hike : కేంద్ర ప్రభుత్వం దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లను నియంత్రించడం కోసం దిగుమతి టారిఫ్‌లను సవరించింది. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య బంగారం, వెండి, ప్లాటినమ్‌పై కస్టమ్స్ డ్యూటీ రూపంలో రూ.10,463 కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
Also Read : భూమిలో పాతిపెట్టిన రూ. 5 లక్షలు.. తీసి చూస్తే మైండ్ బ్లాంక్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్, అమెరికా యుద్ధం మూలంగా హర్మూజ్ మూసివేత నేపథ్యంలో క్రూడాయిల్ దిగుమతి భారీ స్థాయిలో తగ్గిపోయింది. దీంతో ముడిసమురు ధరలు విపరీతంగా పెరిగాయి. చమురు మాత్రమే కాదు ఆహారం, ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో విదేశీ మారకం నిల్వలు కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అందులో కస్టమ్స్ సుంకాల సవరణ ముఖ్యమైనది. ఆయా లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా కొనుగోళ్లు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బంగారం, వెండిపై 6 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని మే 13న 15 శాతానికి సవరించింది. ప్లాటినంపైనా 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచింది. దీంతో కొనుగోళ్లపై ప్రభావం పడింది.
అదే సమయంలో దిగుమతులపై సుంకాలు పెరడగంతో మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య బంగారం దిగుమతిపై రూ.10,040 కోట్లు సుంకాల రూపంలో వసూలైనట్లు మంత్రి వెల్లడించారు. వెండిపై రూ.328 కోట్లు ప్లాటినమ్‌పై రూ.95 కోట్లు చొప్పున ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. మూడు లోహాలపై మొత్తం రూ.10,463 కోట్లు వచ్చినట్లు మంత్రి సభకు వెల్లడించారు. పెరిగిన సుంకాల మూలంగా అదనంగా ఎంత వచ్చిందీ మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇక మే 13 నుంచి జూన్ 30 మధ్య అక్రమ మార్గంలో తీసుకొస్తున్న 161 కేజీల బంగారం పట్టుబడిందని, 116 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారని మంత్రి వివరించారు.
Also Read : అమ్మాయిలు రేప్ ను ఎంజాయ్ చేస్తారు.. రాజకీయ విశ్లేషకుడు అరెస్ట్!









