
Cockroach Janta Party : NEET వివాదం తరహాలోనే ఇథనాల్ బ్లెండింగ్ పాలసీపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. “NEET అయిపోయింది… NEXT ఇథనాల్!” అంటూ సామాజిక మాధ్యమాల్లో మొదలైన ప్రచారం ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనలకు దారితీస్తోంది. గతంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను విమర్శలతో నెట్టివేసిన తరహాలోనే, ఇప్పుడు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. “ధర్మేంద్రను లేపేశాం.. NEXT గడ్కరీ” అనే వ్యాఖ్యలు ఈ రచ్చ తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ (20% ఇథనాల్ కలిపిన ఇంధనం) విధానంపై దేశవ్యాప్తంగా వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ కొత్త ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ దారుణంగా పడిపోతోందని, ఇంజిన్ భాగాలపై తీవ్ర ప్రభావం పడి త్వరగా పాడైపోతున్నాయని డ్రైవర్లు, వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పెట్రోల్ ధరలను భారీగా పెంచి, మరోవైపు నాణ్యత లేని E20 పెట్రోల్‌ను రుద్దడం ఏంటని వాహనదారులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఈ క్రమంలో రవాణా రంగానికి చెందిన వివిధ సంఘాలు ఏకమై కేంద్రంపై సమరభేరి మోగించాయి. ఢిల్లీ టాక్సీ యూనియన్లు, ట్రాన్స్పోర్టర్లు, టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్ల సంఘాలు సంయుక్తంగా నిరసన బాట పట్టాయి. E20 పెట్రోల్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నాయి. ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని నిర్బంధంగా కాకుండా, పాత పెట్రోల్ ఆప్షన్‌ను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ఆందోళనకారులు ఆగస్టు 4న పార్లమెంట్ వరకు భారీ పాదయాత్రకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ముట్టడి ద్వారా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచాలని రవాణా సంఘాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ పాదయాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్టర్లు, డ్రైవర్లు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశముండటంతో రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ప్రభుత్వం, రవాణా సంఘాల మధ్య పెద్ద వివాదంగా మారింది. పర్యావరణ పరిరక్షణ, దిగుమతి భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రోత్సహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాహనదారులకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఈ పాలసీకి పెద్ద సవాలుగా మారాయి. వినియోగదారుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా వేడి పుట్టిస్తోంది.
NEET తర్వాత ఇథనాల్‌పై రూపుదిద్దుకున్న ఈ కొత్త ఉద్యమం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం కనిపిస్తుండటం, పార్లమెంట్ ముట్టడి పిలుపు తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇథనాల్ పాలసీపై వెనక్కి తగ్గుతుందా లేదా ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపుతుందా అనేది వేచి చూడాల్సిందే.









