ACTV prices : దసరా, దీపావళి పండుగుల వస్తున్నాయంటే పలు వస్తువులు ఆఫర్‌లో లభిస్తాయని వినియోగదారులు ఎదురు చూస్తుంటారు. అయితే ఈసారి పండుగ సీజన్‌ ఇంకా మొదలు కాకముందే వినియోగదారులకు ప్రముఖ కన్జూమర్‌ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు భారీ షాక్‌ ఇచ్చాయి. తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించడం గమనార్హం. ఎయిర్‌ కండీషనర్లు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషిన్లు సహా ఇతర గృహోపకరణాల ధరలను 5-8 శాతం మేర సవరించినట్లు ఆయా కంపెనీలు ప్రకటించాయి. కొత్త ధరలు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి కూడా రానున్నాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో పాటు రాగి, స్టీల్‌, క్రూడాయిల్‌ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం దీనికి కారణం. అలాగే, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు కూడా వస్తువుల ధరలు పెరుగుదలకు కారణమని కంపెనీలు వెల్లడించాయి.

ఎయిర్‌ కండీషనర్ల ధరలను ఏకంగా5-8 శాతం వరకు పెంచినట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. అలాగే వాషింగ్‌ మెషిన్లు, ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 3-4 శాతం వరకు పెంచినట్లు తెలిపాయి. ఈ ధరల నిర్ణయంతో పండగ సీజన్‌పై ప్రభావం పడుతుందని కొన్ని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొన్ని కంపెనీలు మాత్రం ఇది తాత్కాలికమేనని చెబుతున్నాయి.

ఆయా వస్తువుల తయారీ కోసం వినియోగించే ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలను 5-8 శాతం పెంచినట్లు బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ వెల్లడించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కూడా ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నాయి. ఇంధన ధరలు భారీగా పెరగడం మూలంగా కాపర్‌, ప్లాస్టిక్‌, స్టీల్‌ ధరలపై ప్రభావం పడిందన్నారు. గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే ఈ సారి అన్నివినియోగ వస్తువులపై దాదాపు 15 శాతం ధరలు పెరిగాయని తెలిపారు. కాగా, ఈ ఏడాది బ్లూ స్టార్ కంపెనీ ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

అలాగే ముడిసరుకు రేట్లు 8-10 శాతం పెరిగాయని గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ విభాగానికి చెందిన కమల్ నంది తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని క్యాటగిరీలపై దాదాపు 5-7 శాతం ధరలు పెంచినట్లు ఆయన తెలిపారు. ఇవి అక్టోబర్‌ నుంచి నవంబర్‌ వరకు దశల వారీగా అమల్లోకి రానున్నట్లు తెలిపారు.

ముడిసరకుల ధరలు ఇలాగే పెరిగితే వచ్చే ఏడాదీ వినియోగదారులపై భారం మరింత పెరిగే అవకాశం ఉందని హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ తెలిపారు. ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషిన్లు ఇతర ఉత్పత్తులపై 2-3 శాతం వరకు రేట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది జనవరి వరకు దశల వారీగా తమ ఉత్పత్తుల ధరలను 15 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపారు.
కాపర్‌ డిమాండ్‌ కారణంగానే తమ ఉత్పత్తుల ధరలను 8-10 శాతం పెంచినట్టు డైకిన్ ఎయిర్ కండీషనింగ్ ఇండియా సీఎండీ కన్వల్జీత్ జావా కూడా తెలిపారు.

దీపావళి వరకు పాత ధరలే!
అయితే వచ్చే పండుగల సీజన్‌ ముందు ఈ పెంపు చేపట్టినప్పటికీ.. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద మాత్రం ఇప్పటికీ పాత ధరలకే కొనుగోలు చేసిన సరకు ఉందని ఆయా కంపెనీలు తెలిపాయి. ఈ క్రమంలో దీపావళి వరకు వినియోగదారులకు పాత ధరలకే కొన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉండే అవకాశం ఉందని. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.