CBI జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ , స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగ అభ్యర్థులు, జార్ఖండ్ ప్రభుత్వానికి నడుమ నెలకొన్న వివాదం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో, తమ డిమాండ్లపై సీబీఐ విచారణకు ఆదేశించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని విద్యార్థి నాయకులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఆగస్టు 10న వేలాది మంది అభ్యర్థులతో జార్ఖండ్ అసెంబ్లీ వైపు భారీ మార్చ్ చేపట్టనున్నట్లు వారు ప్రకటించారు.

మరొకవైపు 14వ JPSC పరీక్షను రద్దు చేయడం, అక్రమాలపై విచారణకు ఆదేశించడం, నియామక వ్యవస్థలో మార్పులు తీసుకురావడం వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్నప్పటికీ, విద్యార్థులు మాత్రం సంతృప్తి చెందలేదు. JSSC-CGL, ఇతర పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, సిజిఎల్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మా డిమాండ్లపై సీబీఐ విచారణ ప్రకటించే వరకు ఎలాంటి రాజీ ప్రసక్తి లేదు, ఆగస్టు 10న అసెంబ్లీని ముట్టడిస్తాం అని విద్యార్థి నాయకులు స్పష్టం చేశారు.

అయితే, CGL పరీక్ష రద్దు డిమాండ్‌పై జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోనూ మాట్లాడుతూ.. ఈ పరీక్ష హైకోర్టు, సుప్రీంకోర్టుల పర్యవేక్షణలో జరిగిందని, ఇప్పటికే ఫలితాలు విడుదలవుతో అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో కూడా చేరారని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం ఏకపక్షంగా ఈ పరీక్షను రద్దు చేయలేదని వివరించారు. దానికి ప్రత్యామ్నాయంగా ఒక రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ వేస్తామని చెప్పినప్పటికీ, విద్యార్థులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. సీబీఐ విచారణ లేని ఏ విచారణా తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం మాత్రం విద్యార్థుల డిమాండ్లలో 98 శాతం ఆమోదించామని చెబుతోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.