Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరగణాల జిల్లాలో పర్యటిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మాజీ సీఎం మమతా బెనర్జీ వాహనంపై అజ్ఞాత వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తాను తృణంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని, ఈ రాళ్లదాడి వల్ల తల పగిలి ప్రాణాలు పోయేవని మమతా బెనర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది.

పోలీస్ కస్టడీలో మరణించిన తమ పార్టీ కార్యకర్త బిర్జూ కేఓట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ హాలిసహర్ వైపు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మార్గమధ్యంలో కొందరు నిరసనకారులు ఆమె కాన్వాయ్‌ను చుట్టుముట్టి కార్‌పై బురద చల్లి, నీళ్ల సీసాలు, చెప్పులు విసిరారు. పెద్దెత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

ఈ ఘటన అనంతరం మమత విలేకరులతో మాట్లాడుతూ.. కారు అద్దాలు మూసి లేకపోతే నా తల పగిలిపోయేది, నేను చనిపోయేదాన్ని. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దాడిని ఎదుర్కోలేదు. మమ్మల్ని కాపాడటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు, వారు కేవలం అధికార బీజేపీకి రక్షణ కల్పిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట ఉన్న ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, డోలా సేన్ కూడా రాష్ట్ర పరిపాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ ఘటనపై బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు శమీక్ భట్టాచార్య స్పందిస్తూ.. దాడులు, హింసను తమ పార్టీ ఎప్పటికీ ప్రోత్సహించదని చెప్పారు. ఈ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కంచ్రాపారా మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ భర్త బిర్జూ కేఓట్‌ను ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా పోలీసులు అరెస్ట్ చేసి, లాకప్‌లో కొట్టి చంపారని టీఎంసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కస్టడీ మరణంపై పోలీసుల స్పందన ఇంకా రావాల్సి ఉంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.