
వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో చాలా మందిని భయపెట్టే అతిపెద్ద సమస్య పాములు. వార్షాల కారణంగా అవి పొడి ప్రదేశం కోసం ఇంటి పరిసరాల్లోకి వచ్చేస్తుంటాయి. మరికొన్ని అయితే ఏకంగా ఇంట్లోని సోఫాలు, వంటగది మూలల్లో తిష్ట వేస్తుంటాయి. అందువల్ల ఈ సీజన్‌లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పాములను ఇంటి పరిసరాల్లోకి రానివ్వకుండా చేయవచ్చు. వీటి కోసం పెరట్లో కొన్ని మొక్కలు నాటితే చాలు.. దెబ్బకు ఒక్క పాము కూడా ఇంటి దరిదాపుల్లోకి రాలేదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో తీసుకోవలసిన ప్రాథమిక జాగ్రత్తలు:
ఈ సీజన్‌లో ఇంటి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తీసివేయాలి.
చిన్న చిన్న మొక్కలను కత్తిరించాలి.
ఇంటి గోడలపై ఏర్పడిన పగుళ్లను మూసివేయాలి.
ఇంటి పరిసరాల్లో ఉండే కన్నాలను క్లోజ్ చేయాలి.
మరీ ముఖ్యంగా ఇంటి లోపల, ఇంటి చుట్టూ ఎలుకలు, కీటకాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాములకు అత్యంత ఇష్టమైన ఆహారం ఎలుకలే కాబట్టి.
పాములకు నచ్చని వాసనలు:
పాములు చాలా తెలివైనవి. వాటికి వాసనను పసిగట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే పాములకు కూడా కొన్ని ఘాటైన వాసనలు అస్సలు నచ్చవు. వాటి విషయానికొస్తే..
పాములకు వెల్లుల్లి, ఉల్లిపాయ, పుదీనా, వెనిగర్ వాసనలు నచ్చవు. వీటి నుండి వచ్చే ఘాటైన వాసన పాములకు విపరీతమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఈ పదార్థాలను ఇంటి ముఖద్వారం లేదా పాములు ఎక్కువగా వచ్చే ప్రదేశంలో పెడితే అద్భుతమైన ఫలితం ఉంటుంది.
అలాగే పాములకు నచ్చని మరో వాసన.. ఫినైల్, కిరోసిన్. వీటి వాసన పాములకు అత్యంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందువల్ల పాములను తరిమికొట్టడానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఒకవేళ పాములు ఇంటి లోపలకు వచ్చినపుడు కంగారు పడి ఫినైల్ లేదా కిరోసిన్‌ను ఇళ్లంతా చల్లకూడదు. ఇలా చేస్తే ఆ వాసన తట్టుకోలేక పాము వేగంగా దాడి చేసే అవకాసం ఉంటుంది. కాబట్టి పాము ఉన్న చోట చిన్నగా ఫినైల్ చల్లి.. అది బయటకు వెళ్లేందుకు వీలుగా తలుపులు లేదా కిటికీలను తెరచి ఉంచాలి.
వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగం నూనెతో కూడా పామును తరిమికొట్టొచ్చు. వీటిని సమాన మోతాదులో మిక్స్ చేసి దాని స్ప్రే ఒక సీసాలో ఉంచుకోవాలి. పాము ఇంటి పరిసరాల్లో కనిపించగానే దూరం నుంచి చల్లితే.. ఆ వాసనకు పాము పరుగులు పెడుతుంది.
పాములను పరిగెత్తించే ఔషధ మొక్కలు
కొన్ని రకాల మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచుకోవడం ద్వారా కూడా పాములను తరిమికొట్టొచ్చు. అందులో సర్పగంధ మొక్క ఒకటి. వీటి వేర్లు, విత్తనాలు ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. ఈ మొక్కలో ఉండే ఆల్కలాయిడ్స్ కారణంగా పాములు ఈ మొక్క దరిదాపుల్లో చేరవు. వీటిని ఇంటి పరిసరాల్లో పెంచుకుంటే బాగా ఉపయోగపడుతుంది.
దీంతోపాటు గరుడ చెట్టు కూడా ఒకటి ఉంది. ఈ చెట్టు పండు పొడవుగా.. చూడ్డానికి అచ్చం పాము ఆకారంలోనే ఉంటుంది. ఈ గరుడ చెట్టుకు పాము విషాన్ని విరిచే ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు ఇంటి బయట ఉంటే ఇక్క విషసర్పం కూడా రాదు.
అలాగే ఇవి కాకుండా స్నేక్ ప్లాంట్, తులసి, వార్మ్‌వుడ్, బంతిపువ్వు, నిమ్మగడ్డి, కాక్టస్ వంటి మొక్కల వాసనను పాములు భరించలేవు.









