
NEET Re-Exam : అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించిన నీట్ రీ-ఎగ్జామ్‌లోనూ ఘరానా మోసాలు వెలుగుచూశాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు సినిమా లెవల్ లో స్కెచ్ వేసిన చివరకు అడ్డంగా దొరికిపోయారు. పరీక్ష జరిగిన మరుసటి రోజే బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో భారీగా నకిలీ అభ్యర్థుల నెట్‌వర్క్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో 14 మంది బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీ ఉద్యోగులతో పాటు మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజమైన విద్యార్థుల బదులు పరీక్షలు రాయించడానికి ఈ ముఠా ఏకంగా బయోమెట్రిక్ సిబ్బంది డ్రెస్సులు వేసుకుని పరీక్షా కేంద్రాల్లోకి చొరబడటం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.
పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మయాంక్ కాశ్యప్ అనే విద్యార్థి.. హసన్పూర్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలోకి బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగిగా మారువేషంలో చొరబడ్డాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు మొదట అతన్ని పట్టుకుని విచారించడంతో ఈ భారీ కుంభకోణం గుట్టు రట్టయింది. మయాంక్ ఇచ్చిన సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు.. జిల్లాలోని మూడు ప్రధాన పరీక్షా కేంద్రాలపై మెరుపు దాడులు చేసి, ఒకరి తర్వాత ఒకరిని లాగారు.
21 మందిని పోలీసులు అరెస్ట్
మొత్తం 9 మంది నకిలీ అభ్యర్థులతో పాటు, వీరికి సహకరించిన మరో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో షాకింగ్ విషయమేమిటంటే.. అభ్యర్థుల గుర్తింపును సరిచూడాల్సిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులే ఈ ముఠాతో చేతులు కలిపారు. డబ్బులకు ఆశపడి నకిలీ అభ్యర్థులు లోపలికి వెళ్లేలా వీరు సహకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ అభ్యర్థి తన లోదుస్తుల్లో సిమ్ కార్డు, నీట్ పాత ప్రశ్నపత్రంతో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. . తన పేరు ప్రిన్స్ దూబే అని, బలియా జిల్లాకు చెందినవాడినని ప్రాథమిక విచారణలో అతడు తెలిపినట్లు సమాచారం.
ఇక హైదరాబాద్‌లోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడ జడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి కాపీ కొట్టడానికి వేసిన ప్లాన్ చూసి అధికారులే షాక్ తిన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఈ అభ్యర్థి, పరీక్ష ప్రారంభానికి ముందే ఉదయం 7 గంటలకే కేంద్రానికి చేరుకుని, ఎవరికీ తెలియకుండా ఒక జిప్‌లాక్ కవర్లో మొబైల్ ఫోన్‌ను ఉంచి బాత్రూమ్ ఫ్లష్ ట్యాంక్‌లో దాచాడు. ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో తనకు కడుపునొప్పి వస్తోందంటూ అనుమతి తీసుకుని బాత్రూమ్కు వెళ్లాడు.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు
అయితే, అతను ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్లు లోపలికి వెళ్లి తనిఖీ చేయగా, ఫ్లష్ ట్యాంక్ నుంచి ఫోన్ తీసి సమాధానాలు వెతుకుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీనిపై స్కూల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో ఆదిభట్ల పోలీసులు విద్యార్థిపై చీటింగ్ మరియు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేయడంతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.









