
DJ music : ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు భారీ శబ్దంతో డీజే మ్యూజిక్ పెట్టడంతో 20 రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విగ్రహాల నిమజ్జనం ఊరేగింపులో భాగంగా వచ్చిన డీజే వాహనం వారి ఇంటి ముందు ఆగి పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంతో చిన్నారి గుండె ఆగిపోయిందని వారు చెబుతున్నారు. డీజే వాహనాన్ని అక్కడి నుంచి కదిలించాలని, శబ్దం తగ్గించాలని ఎన్నిసార్లు కోరినా నిర్వాహకులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బల్లియా జిల్లాలోని ముడియారి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మణియార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో ఓ గుడిసెలో రీమా దేవి తన 20 రోజుల కూతురితో కలిసి నిద్రిస్తోంది. అదే సమయంలో నిమజ్జనం ఊరేగింపులో భాగంగా డీజే సిస్టమ్ ఏర్పాటు చేసిన ట్రక్కు వారి ఇంటి దగ్గరకు వచ్చింది. అక్కడే ఆగి చాలా పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టారు. ఆ శబ్దం కారణంగానే చిన్నారి గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రీమా దేవి ఇటీవలే తన పుట్టింటికి పసికందుతో కలిసి వచ్చింది. అత్తవారింట్లో తనను, బిడ్డను చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో పుట్టింటికి వచ్చినట్లు చిన్నారి అత్త తెలిపింది. గత పది రోజులుగా కుటుంబ సభ్యులే తల్లీబిడ్డను చూసుకుంటున్నారని చెప్పింది. “నా వదిన తన పసికందుతో కలిసి మా ఇంటికి వచ్చింది. అత్తవారింట్లో వాళ్లను చూసుకునేవారు ఎవరూ లేరు. గత పది రోజులుగా మేమే తల్లీబిడ్డను చూసుకుంటున్నాం. డీజే సిస్టమ్ ఉన్న ట్రక్కు భారీ శబ్దంతో వచ్చి మా ఇంటి ముందు ఆగింది. ఆ సమయంలోనే చిన్నారి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది” అని చిన్నారి అత్త తెలిపింది. డీజే వాహనాన్ని అక్కడి నుంచి కదిలించాలని, తమ ఇంటి ముందు అంత పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టవద్దని నిర్వాహకులను కోరామని ఆమె చెప్పింది. అయినా వారు తమ మాట వినలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు తల్లితో కలిసి నిద్రిస్తున్న చిన్నారి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై డీఎస్పీ జై శంకర్ మిశ్రా స్పందించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినట్లు తెలిపారు. డీజే సిస్టమ్ ఉన్న వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. చిన్నారి మృతికి అసలు కారణం ఏమిటనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. డీజే శబ్దం వల్లే చిన్నారి చనిపోయిందన్న కుటుంబ సభ్యుల ఆరోపణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.









