Education Minister : కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ పేపర్ లీకేజీ వివాదం ,దేశవ్యాప్త నిరసనల నేపథ్యంతో పాటు, సీజేపీతో జరిగిన చర్చల అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధాన్ వైదొలగడంతో ఖాళీ అయిన విద్యాశాఖ బాధ్యతలను ప్రభుత్వం తాత్కాలికంగా మరొకరికి అప్పగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార , ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది. ఆయన తన ప్రస్తుత శాఖలతో పాటు విద్యాశాఖ వ్యవహారాలను కూడా అదనంగా పర్యవేక్షిస్తారు. నీట్ వివాదం వల్ల తలెత్తిన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ, విద్యార్థి లోకంలో నమ్మకాన్ని పునరుద్ధరించే కీలక బాధ్యత ఇప్పుడు ప్రహ్లాద్ జోషి భుజస్కంధాలపై పడింది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తదుపరి పరిణామాలతో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోయాయి. కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరవుతారనే దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేలకు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిలో ఒకరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుని విద్యాశాఖను అప్పగిస్తారని, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మారతారని ప్రచారం జరిగింది.

అయితే ఈ ఊహాగానాలన్నింటికీ స్వస్తి పలుకుతూ కేంద్రం ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో తాత్కాలికంగా ఈ సందిగ్ధతకు తెరపడింది. రాబోయే రోజుల్లో చేపట్టబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో విద్యాశాఖ మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవైపు నూతన విద్యాశాఖ మంత్రి ఎంపిక, మరోవైపు విద్యా వ్యవస్థలో సంస్కరణల అమలు ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లుగా నిలిచాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.