Rahul Gandhi  :  లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నిబంధనలకు విరుద్ధంగా తీవ్ర ఆరోపణలు చేశారని, పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయన గురువారం ఈ నోటీసు దాఖలు చేశారు.

లోక్‌సభ నిబంధనల ప్రకారం రూల్ 222, 223 కింద ఈ నోటీసును సమర్పించిన అనురాగ్ ఠాకూర్.. ఈ అంశాన్ని స్పీకర్ ఆమోదించి, తదుపరి సమగ్ర విచారణ కోసం రూల్ 227 కింద ప్రివిలేజెస్ కమిటీకి పంపాలని కోరారు. జూలై 29న లోక్‌సభలో నీట్ పేపర్ లీక్ ఉదంతం, ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల చర్యల గురించి జరిగిన చర్చలో రాహుల్ గాంధీ చేసిన వ్యాపారాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తగిన ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నిరాధారమైన, తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ రూల్ 353 ని ఉల్లంఘించారని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేసే ముందు సంబంధిత వ్యక్తికి లేదా స్పీకర్‌కు తగినంత ముందస్తు నోటీసు ఇవ్వాలని, తద్వారా వారు స్పందించడానికి అవకాశం ఉంటుందని ఈ నిబంధన చెబుతోంది. ఎలాంటి ఆధారాలు లేదా ముందస్తు సమాచారం లేకుండా అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు.

అలాగే ఓ విద్యార్థితో జరిగిన సంభాషణను వివరిస్తూ సభలో ‘ఇడియట్’, ‘అంధ్‌భక్త్’ వంటి అన్‌పార్లమెంటరీ పదాలను ఉపయోగించడం ద్వారా రూల్ 352 ని రాహుల్ ఉల్లంఘించారని ఠాకూర్ తెలిపారు. పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా, దూషణపూరితమైన పదాలను ఆయన వాడారని విమర్శించారు. సభలో చర్చకు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ, అనవసరమైన ప్రసంగాలతో సభ సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు.

రాహుల్ గాంధీ వ్యవహారశైలి సభా మర్యాదలకు భంగం కలిగించేలా ఉందని, దీనిపై ప్రివిలేజెస్ కమిటీ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని అనురాగ్ ఠాకూర్ తన నోటీసులో డిమాండ్ చేశారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.