Ayodhya Temple :  అయోధ్య రామ మందిర నిర్మాణంలో హుండీ డబ్బుల చోరీ ఘటన నేపథ్యంలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈవో పోస్టుకు ధరఖాస్తులు ఆహ్వనించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుకు 5,300 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 18 మందిని షార్ట్ లిస్టు చేసినట్లుగా ఆలయ వర్గాలు వెల్లడించాయి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మంగళ, బుధవారాల్లో ఆలయ ప్రాంగణంలో మాజీ న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, షిర్డీ సాయిబాబా ట్రస్ట్ మాజీ ఛైర్మన్, శాస్త్రవేత్త సురేష్ హవారేలతో కూడిన ప్యానెల్ ఇంటర్వ్యూ చేయనుంది.

Also Read : జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలో బిగ్‌ట్విస్ట్‌.. జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్ ఖియాంగ్టే అరెస్టు

రామ మందిర వ్యవహారాలు బిజినెస్ , మేనేజ్మెంట్ వంటి పనులను ట్రస్ట్ సీఈవో చేతిలో పెట్టనుంది ట్రస్ట్. సీఈవోగా ఎంపికైన అభ్యర్థి హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తి అయి ఉండాలి. అలాగే హిందూ సంప్రదాయాలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. అభ్యర్థి పూర్తి శాకాహారిగా ఉండటంతో పాటుగా మద్యపానం సేవించకూడదు. ఈ పోస్టుకు వయోపరిమితిని 50 నుంచి 70 ఏళ్ల మధ్యగా నిర్ణయించింది ట్రస్టు బోర్టు. జూన్ మొదటి వారంలో రామ మందిర విరాళాల దుర్వినియోగం వెలుగులోకి వచ్చిన తర్వాత, ట్రస్ట్ అధికారులు సీఈఓను నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 18 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయగా, చివరికి సీఈఓ పదవి బాధ్యతలు ఎవరు చేపడతారో అన్నది ఉత్కంఠగా మారింది.

మరోవైపు హుండీ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న సిట్ ను ఏర్పాటు చేసింది. జూన్ 23న సిట్ ప్రాథమిక నివేదిక సమర్పించిన తర్వాత జూన్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఎనిమిది మంది నిందితులు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను అరెస్ట్ చేశారు. దర్యాప్తు సమయంలో, పోలీసులు పలువురు నిందితుల నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో శుక్లా నుంచి అత్యధికంగా రూ. 20.39 లక్షలు స్వాధీనం కాగా, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామమందిర నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు త్వరలోనే సీఈఓ ఎంపికను పూర్తి చేయనున్నారు.

Also Read : ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.