
Jharkhand : సోషల్ మీడియాలో రీల్స్ చేయడం ప్రాణాల మీదకు తెస్తోంది, తాజాగా ఇటువంటి ఘటనే జార్ఖండ్‌లో జరిగింది. రైలు పట్టాలపై రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో 19 ఏళ్ల యువతి తన రెండు చేతులను కోల్పోయింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లా జోబ్రైయా గ్రామం సమీపంలో జరిగింది.
బాధిత యువతిని గర్వా పట్టణంలోని అశోక్ విహార్ కాలనీకి చెందిన పూర్ణిమ కుమారిగా గుర్తించారు. పూర్ణిమ తన స్నేహితులతో కలిసి మంగళవారం రైల్వే ట్రాక్ వద్ద రీల్స్ వీడియో షూట్ చేయడంలో బిజీగా ఉంది. ఆ సమయంలో రాంచీ నుంచి చోపాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది.
Also Read : కృతి సనన్ యాడ్.. హీరోయిన్ కు రాహుల్ గాంధీ మద్దతు!
ఈ ప్రమాదంలో పూర్ణిమ రెండు చేతులు తెగిపోయాయి, అలాగే శరీరంలోని ఇతర భాగాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పిపడిపోయింది. ఇది చూసిన ఆమె స్నేహితులు తీవ్ర భయాందోళనకు గురై, వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గర్వా సదర్ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి చేరుకున్న వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పరిస్థితి చాలా విషమంగా ఉండటం, రక్తస్రావం ఎక్కువగా జరగడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను వేరే పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు. కూతురికి జరిగిన ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు సదర్ ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈ ఘటనపై గర్వా సివిల్ సర్జన్ జాన్ ఎఫ్ కెన్నెడీ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చిన యువతికి అవసరమైన ప్రాథమిక వైద్యం అందించామని తెలిపారు. ఆమె రెండు చేతులు తీవ్రంగా దెబ్బతిని తెగిపోవడంతో పాటు ఇతర గాయాలు కూడా కావడంతో, మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి పంపించినట్లు ఆయన వెల్లడించారు.
Also Read : ఢిల్లీలో 2300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు… కేంద్రం సంచలన ప్రకటన!









