
-RAVI PRAKASH
Amit Shah : ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక చర్చ జోరుగా సాగుతోంది. అమిత్ షా బలహీనపడటం మొదలైందా అనే ప్రశ్నపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. భారత రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన హోం మంత్రిగా, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని నాయకుడిగా గుర్తింపు పొందిన అమిత్ షా, ఇప్పుడు రాజకీయంగా వెనకడుగు వేశారా అనే సందేహం వ్యక్తమవుతోంది. దమ్ముంటే పార్లమెంట్ సభలకు వచ్చి తమను ఎదుర్కోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ, అమిత్‌షా పార్లమెంట్‌కు రాకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారు? దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన కీలక పరిణామం ఒక్కసారిగా ఇంత పెద్ద రాజకీయ వివాదంగా ఎందుకు మారింది? ముఖ్యంగా, జెన్-జీ (నూతన తరం) ఆందోళనలను అమిత్‌షా హ్యాండిల్ చేసిన తీరుపై ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం, అందునా మోహన్ భాగవత్ ఆయనకు దూరం జరుగుతున్నట్టుగా ఎందుకు కనిపిస్తున్నారు? ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, అమిత్ షా రాజకీయ ప్రతిష్ట ఇప్పుడు దెబ్బతింటోందా? ఇవి కేవలం అపోహలు మాత్రమే కావన్న వాదన వినిపిస్తోంది. ప్రముఖ జర్నలిస్ట్ హరీష్ ఖరే ఇటీవల ‘ది వైర్’ పత్రికలో రాసిన ఒక విశ్లేషణాత్మక వ్యాసమే ఈ చర్చకు మూలమవుతోంది. ఆ వ్యాసం శీర్షిక “అమిత్ షా బలహీనపడటం మొదలైందా?” (Is Amit Shah’s Meltdown a Work in Progress?). ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అమిత్ షా రాజకీయ పతనం పూర్తయిపోయిందని చెప్పడం ఈ విశ్లేషణ ఉద్దేశం కాదు. ఇది చాలా కీలకమైన సమయంలో తెరపైకి వచ్చిన ఒక రాజకీయ వాదన మాత్రమే. ఎందుకంటే, అమిత్ షా ఏళ్లుగా ఒక ప్రత్యేకమైన రాజకీయ ప్రతిష్టను నిర్మించుకున్నారు. ఆయన వెనక్కి తగ్గని, ఎలాంటి ఒత్తిడికీ తలొగ్గని, ఎల్లప్పుడూ దూకుడుగా వ్యవహరించే నాయకుడు. మరి అలాంటి నాయకుడి ప్రస్తుత పరిస్థితిపై ఇప్పుడు ఎందుకు ఇంత కీలక చర్చ జరపాల్సి వస్తోందన్నదే ముఖ్యం.
Also Read : రేషన్ తీసుకోవడం ఇక ఈజీ.. దేశంలోనే సరికొత్తగా ఏటీఎం సేవలు షురూ!
అమిత్ షా రాజకీయాలను ఒక్క మాటలో చెప్పాలంటే అపారమైన ఆత్మవిశ్వాసంతో కూడినవి ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. ప్రతిపక్షాలతో పోరాటం నుంచి దేశంలో శాంతిభద్రతల నిర్వహణ వరకు జాతీయ భద్రత నుంచి మొదలుకొని ఇతర దేశాలతో నేరుగా జరిగే రాజకీయ యుద్ధాల వరకు ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఘర్షణాత్మక పరిస్థితుల నుంచి కూడా రాజకీయ బలాన్ని పుంజుకోగల నాయకుడిగా షా పేరు తెచ్చుకున్నారు. అయితే, హరీష్ ఖరే తన విశ్లేషణలో ప్రస్తావించినట్టు అమిత్ షా పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండటం ఆయనకు ఇప్పటివరకు ఉన్న ఇమేజ్‌కు భిన్నంగా కనిపిస్తోంది. ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోవడంలో వెనుకాడని నాయకుడు ఇటీవల పార్లమెంట్‌కు రాకపోవడంపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు కొత్త చర్చకు దారితీశాయి. 2019లో కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ రాజకీయాల్లో ఆయన తన స్థానాన్ని వేగంగా బలపరుచుకున్నారు. అధికార యంత్రాంగం, నిఘా వ్యవస్థ, పోలీస్ ఉన్నతాధికారులు, జాతీయ భద్రతా యంత్రాంగంపై ఆయన ప్రభావం గణనీయంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. అమిత్‌షాతో సమావేశమైన సీనియర్ అధికారులు, డీజీపీలు, కమిషనర్లు, రాజకీయ సంపాదకులు దేశ భద్రత పట్ల ఆయనకున్న స్పష్టత, విజన్, కఠిన వైఖరిని చూసి ప్రభావితమయ్యేవారని సమాచారం. దేశంలో వ్యవస్థలు వేగంగా, కఠినంగా పనిచేయాలని కోరుకునే హోం మంత్రిగా ఆయన ప్రతిష్ట పెరిగింది. ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అత్యంత శక్తివంతమైన రెండో నాయకుడిగా తన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయన ఇమేజ్ మసకబారిందా అనే అంశంపై వస్తున్న ప్రశ్నలు కేవలం ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాక స్వయంగా సంఘ్ పరివార్ నుంచి కూడా వస్తున్నట్లు కనిపిస్తుండటమే అసలు ట్విస్ట్.
జెన్-జీ యువత నిరసనలను ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు హ్యాండిల్ చేసిన తీరుపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన యువత అంతా బీజేపీకి రాజకీయ శత్రువులు కారు. వారిలో చాలామంది హిందూ యువతే ఉన్నారు. ప్రభుత్వంపై లేదా ప్రధానిపై ఉన్న అసంతృప్తితో వారు హద్దులు దాటి మాట్లాడి ఉండవచ్చు. కానీ ప్రభుత్వం వారిపై వ్యవహరించిన తీరు, పోలీసుల కఠిన చర్యలు ఒక పెద్ద రాజకీయ సమస్యగా మారాయి. పోలీసులు జెన్ జీపై కఠినంగా ప్రవర్తించారని, ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులకు ఉన్న రాజకీయ మద్దతే ఆ ధీమాకు కారణమని విమర్శలు వస్తున్నాయి. హోం మంత్రిగా పోలీస్ వ్యవస్థకు రాజకీయ నాయకత్వం వహిస్తున్న అమిత్ షా ఈ ఆరోపణలకు జవాబుదారీగా నిలవాల్సి వస్తుంది. పోలీసు చర్యల వల్ల కలిగిన రాజకీయ నష్టం ప్రధాని మోదీ ఇమేజ్‌పై పడుతోందనే వాదన ఉంది. అయితే, భద్రతా వ్యవస్థ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటుంది కాబట్టి, ఆ రాజకీయ బాధ్యత నుంచి హోం మంత్రిని వేరు చేయలేం. ఒకవైపు ఆర్‌ఎస్‌ఎస్, మరోవైపు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వంటి వారి నుంచి అమిత్ షా తీరుపై ఒత్తిడి పెరుగుతోంది.
గతంలో అమిత్ షాను ‘చాణక్యుడిగా’, వ్యూహ చతురుడిగా అభివర్ణించేవారు. కానీ రాజకీయాల్లో అధికారంతో పాటు ప్రజల అభిప్రాయం (పర్సెప్షన్) చాలా ముఖ్యం. ఒక నాయకుడిని ఓడించడం అసాధ్యం అనే నమ్మకం సడలితే రాజకీయ సమీకరణాలు వేగంగా మారతాయి. నిజానికి మోదీ, అమిత్ షాను పదవి నుంచి తొలగిస్తారని లేదా ఆయన రాజకీయ జీవితం ముగిసిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆయన ఇప్పటికీ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరు. అయినప్పటికీ, ఈ పరిణామాలు ఐదు కీలక ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి. జంతర్ మంతర్ ఘటనతో అమిత్ షా రాజకీయ ప్రతిష్టకు గండిపడిందా? యువత ఆందోళనలపై ప్రభుత్వ వైఖరి పట్ల ఆర్‌ఎస్‌ఎస్ అసంతృప్తితో ఉందా? బిజెపిలో అమిత్ షా తిరుగులేని నాయకుడనే భావన బలహీనపడుతోందా? మోదీ-షాల ద్వయం ఈ రాజకీయ ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకోగలదా? ఇది తాత్కాలిక రాజకీయ ఉపద్రవమా లేదా అమిత్ షా రాజకీయ ప్రయాణంలో ఒక పెద్ద మార్పునకు సంకేతమా? దీనికి సమాధానం కాలమే నిర్ణయించాలి.
Also Read : దిగుమతి టారిఫ్ పెంపుదల.. బంగారం, వెండితో ₹10వేల కోట్లు రాబడి









