
Ujjain : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరం ఆందోళనలతో అట్టుడుకుతోంది. నగరంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సోమవారం షాహి మసీదులో కొంత భాగాన్ని కూల్చివేయాలని ఉజ్జయిని మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించడం ఉద్రిక్తతకు దారి తీసింది. కార్పొరేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక వర్గానికి చెందిన వ్యక్తులు నిరసన ప్రదర్శన చేపట్టడంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా మసీదులో కొంత నిర్మాణాన్ని తొలగించేందుకు సంబంధిత అధికారులు మసీదు ప్రాంతానికి చేరుకోవడంతో దాన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. వారి ఆందోలన నేపథ్యంలో పోలీసులు భారీ స్థాయిలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గానికి చెందిన ప్రజలు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది.
Also Read : టీవీ, ఏసీ, ఫ్రిజ్.. అన్నీ ఖరీదే! మహా ఖరీదైన రోజులు రాబోతున్నాయా?
నగరంలో రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం షాహి మసీదులో కొంత భాగాన్ని కూల్చివేయాలని ఉజ్జయిని మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించడమే ఈ ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. అయితే ఆందోళన కారులను పోలీసులు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించాలని కోరారు. అయినా వారి సూచనను ప్రదర్శనకారులు పెడచెవిన పెట్టారు. ఆందోళన తీవ్ర రూపం దాల్చి పరిస్థితి చేజారిపోయే ప్రమాదం కనిపించడంతో పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాళ్లు విసురుతున్న ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినా వారు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. పోలీసుల చర్యతో కొన్ని గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా.. రోడ్డు విస్తరణ కోసం షాహి మసీదు మాత్రమే కాకుండా మరో 272 నిర్మాణాలను కూడా కూల్చివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, ఖజుర్ వలీ మసీదు నుంచి గణేశ్ చౌక్ వరకు 730 మీటర్ల పొడవునా రోడ్డు వేయాలని ఉజ్జయిని మున్సిపాలిటీ నిర్ణయించింది. వచ్చే సింహస్థ కుంభమేళా కోసం రూ.9.8 కోట్ల ఖర్చుతో ఈ రోడ్డు విస్తరించనున్నారు. కాగా.. ఈ ప్రాజెక్టు కోసం షాహి మసీదులో కొంత భాగాన్ని కూల్చివేయాలని ఉజ్జయిని మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే దీన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇదివరకే కొట్టివేసిన విషయం తెలిసిందే.
Also Read : పసిడి ప్రియులకు ఊరట.. దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములపై నేడు ఎంత తగ్గిందంటే?









