
సుకన్య సమృద్ధి యోజన పథకం(SSY).. దీని గురించి అందరూ వినే ఉంటారు. ఆడపిల్లల సంక్షేమం, వారి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కుమార్తె విద్య, వివాహ ఖర్చులకు కొండత అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. కేవలం రోజుకు రూ.50 చొప్పున పక్కన పెడితే.. ఆఖరిలో భారీ మొత్తం లభిస్తుంది. ఈ స్కీం బెనిఫిట్స్ గురించి తెలియక చాలామంది పేరెంట్స్ దీనిని పట్టించుకోవడంలేదు. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పొదుపు పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన పథకం(SSY) ఒకటి. ప్రత్యేకంగా 10 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బాలికల పేరు మీద తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు పోస్ట్ ఆఫీస్ ద్వారా లేదా బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇలా ఖాతా ఓపెన్ చేసిన తేదీ నుండి 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ అవుతుంది. ఒకవేళ బాలికకు 18ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత వివాహం జరిగితే మాత్రమే అకౌంట్‌ను ముందుగా క్లోజ్ చేయడానికి అనుమతి ఉంటుంది.
అలా కాకుండా అమ్మాయి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే లేదా 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత విద్య కోసం డిపాజిట్ చేసిన అమౌంట్‌లో 50శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
కాగా ఒక కుటుంబంలో ఒక ఆడపిల్లకు మాత్రమే ఈ పథకం ఉండాలి. అయితే పేరెంట్స్, సంరక్షకులుగా గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం రెండు అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే కవలలు, ముగ్గురు ఉన్న వారికి ఇది వర్తించదు.
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1,50,000 వరకు ఎంతైనా డిపాజిట్ చేసుకునే వీలుంటుంది. ఇలా అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 15 ఏళ్ల పాటు ఆ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తూ.. దాన్ని యాక్టివ్‌గా ఉంచాలి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక SSY డిపాజిట్ చేయాలి. ఇలా చేస్తే ఆ అకౌంట్ 21ఏళ్ల మెచ్యూరిటీ వరకు వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది. ఒకవేళ సమయానికి డబ్బులు చెల్లించకపోతే.. అకౌంట్ ఆగిపోతుంది. అప్పుడు రూ.50 జరిమానా చెల్లించి తిరిగి అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇలా ప్రతి నెలా కడుతున్న అమౌంట్‌కు వడ్డీ కూడా అధికంగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం కింద సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ రేటును ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఈ వడ్డీ రేట్లు ఏడాదికి మారుతూ ఉంటాయి. రోజుకు కేవలం రూ.50 పక్కన పెడితే.. నెలకు సుమారుగా రూ.15000 అవుతుంది. అంటే ఏడాదికి రూ.18000 అకౌంట్‌లో జమ చేసుకోవచ్చు. ఇలా 15 ఏళ్లలో పేరెంట్స్ జమ చేసే మొత్తం అసలు రూ.2,70,000 అవుతుంది.
అలాగే 8.2శాతం వడ్డీ రేటు ప్రకారం.. కుమార్తెకు 10 ఏళ్ల వయస్సు ఉన్నపుడు నెలకు రూ.1500 చొప్పున డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయానికి రూ.5,61,309 కేవలం వడ్డీ రూపంలోనే వస్తుంది. ఇలా డిపాజిట్ చేసిన అసలు మొత్తం రూ.2,70,000 + వడ్డీ రూ.5,61,309 కలిపి మొత్తం రూ.8,31,309గా లభిస్తుంది.
అయితే దీని టైంపీరియడ్ పూర్తి కాకుండా అకౌంట్‌ను క్యాన్సిల్ చేయడం కుదరదు. కొన్ని సందర్భా్ల్లో దీనికి మినహాయింపు ఇచ్చారు. అందులో అనుకోని పరిస్థితుల్లో బాలిక మరణిస్తే ఆమె డెత్ సర్టిఫికేట్, ఫారం-2 ఇచ్చి అకౌంట్‌ను క్లోజ్ చేసి అప్పటి వరకు జమ చేసిన మొత్తాన్ని తిరిగి విత్ డ్రా చేసుకోవచ్చు. అలా కాకుండా అకౌంట్ ఓపెన్ చేసిన 5 ఏళ్ల తర్వాత బాలికకు అనారోగ్యం లేదా ఫ్యామిలీలో ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే ముందస్తుగా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.









