Supreme Court
Supreme Court

Supreme Court : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ (NEET), ఇతర పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ప్రజాస్వామ్య నిరసనలకు దారితీసింది. అయితే, ఈ ఆందోళనల్లో పాల్గొని అరెస్టయిన 18 ఏళ్లలోపు మైనర్లందరినీ తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నేర చరిత్ర లేని మైనర్లపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాలా బాగ్చీ, జస్టిస్‌ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులను జారీ చేస్తూ, ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు కొనసాగించవచ్చని మినహాయింపు ఇచ్చింది.

ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల ర్యాలీలపై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారనే ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. పోలీసు బలప్రయోగంపై సమగ్ర, నిజాయితీ,స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) లేదా టాస్క్‌ఫోర్స్‌ను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఇదే సమయంలో, విద్యార్థుల దాడిలో గాయపడిన పోలీసుల కుటుంబాల ఫిర్యాదులను కూడా ఈ దర్యాప్తులో భాగం చేయాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

సిట్‌ ఏర్పాటుపై తమ తుది నిర్ణయం వెలువరించడానికి ముందు వాదనలు వినేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో జరిగిన ‘చలో సంసద్‌’ నిరసనల్లో రక్షణ దళాలు విచ్చలవిడిగా ప్రవర్తించాయని పిటిషనర్లు ఆరోపించారు. మేకులు ఉన్న లాఠీలు, ఎలక్ట్రిక్‌ బ్యాటన్లు, టియర్‌గ్యాస్‌, ప్లాస్టిక్‌ పెల్లెట్‌ గన్స్‌ ఉపయోగించి విద్యార్థులను చిత్రహింసలకు గురిచేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్ల వాదనలపై స్పందించిన సీజేఐ, “శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపై అతిగా వ్యవహరిస్తే చట్టం ఊరుకోదు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిందే, లేదంటే దర్యాప్తు వ్యవస్థకే అర్థం ఉండదు” అని కేంద్రం తరఫు న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని, గుంపులను చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్‌, పెల్లెట్‌గన్స్‌ వాడకంపై ప్రస్తుతం ఉన్న పోలీసు మార్గదర్శకాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికై అఖిల భారత స్థాయిలో అధ్యయనం చేయడానికి ఒక ‘హైపవర్‌ కమిటీ’ని వేయాలని సూచించారు.

Also Read : పరారీకి ప్రయత్నించిన గ్యాంగ్ రేప్ నిందితులు.. కస్టడీలోనే ప్రజల దాడి

జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు, రాళ్లు విసిరే మూకలపై వాడే పెల్లెట్‌గన్స్‌ను స్వదేశీ విద్యార్థులపై ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (IB) మాజీ స్పెషల్‌ డైరెక్టర్‌ యశోవర్ధన్‌ ఆజాద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. “వారు ఉగ్రవాదులు కాదు, తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న విద్యార్థులు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నిరసనల్లో పాల్గొనకపోయినా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌కుమార్‌, షేక్‌ ఎర్షాద్‌ అనే వ్యక్తులు కూడా కోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు.

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనల్లో ఒక డీసీపీ ర్యాంకు అధికారి ఆదేశాల మేరకే ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (RAF) విద్యార్థులపై విరుచుకుపడిందని పోలీసు రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు 55 నాన్‌-ఎలక్ట్రికల్‌ షెల్స్‌, 15 ఎలక్ట్రిక్‌ షెల్స్‌, 5 టియర్‌గ్యాస్‌ గ్రెనేడ్లు, అలాగే యాంటీ-రియట్‌ గన్స్‌ ద్వారా ప్లాస్టిక్‌ పెల్లెట్లను ప్రయోగించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నిరసనలకు సంబంధించిన సీసీటీవీ, డ్రోన్‌ ఫుటేజ్‌లతో పాటు పోలీసుల బాడీ కెమెరాల రికార్డింగ్‌ను భద్రపరచాలని రాష్ట్రాలను కోర్టు ఆదేశించింది.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని , సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. బిహార్‌, మహారాష్ట్ర, అసోం, రాజస్థాన్‌ రాష్ట్రాలు ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తున్నట్లు, అరెస్టయిన వారిని తక్షణమే విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశాయి. లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులను పట్టుకోకుండా, విద్యార్థులపై కేసులు పెట్టడం సరికాదని ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రతిపక్షాలు సైతం డిమాండ్‌ చేశాయి.

మరోవైపు నీట్‌ ఆందోళనల్లో అరెస్టయి, కేసులతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ ముందుకొచ్చారు. ‘సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌’ (CJP) ఏర్పాటు చేసిన ప్రత్యేక లీగల్‌ ఎయిడ్‌ ఫండ్‌కు ఆయన తన సొంత నిధుల నుంచి రూ.కోటి విరాళంగా ప్రకటించారు. కాగా, సీసీటీవీ ఆధారాలను భద్రపరచాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.

Also Read : మధురై మీనాక్షి ఆలయ భూముల్లో అవకతవకలు… 19 మందిపై ఎఫ్‌ఐఆర్‌

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.