Suvendu Adhikari :  1975 నాటి ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడి జైలుకు వెళ్లిన 325 మందికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతి నెలా రూ.10,000 పింఛన్ ఇవ్వనున్నట్లు సీఎం సువేందు అధికారీ ప్రకటించారు. నాటి రోజుల్లో ప్రజాస్వామ్యం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి కోసం పశ్చిమ బంగ లోక్‌తంత్ర సేనాని సమ్మాన్ కింద ఈ గౌరవ వేతనాన్ని అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం సువేందు అధికారీ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ సమయంలో పోరాటం చేసిన ధీరులు తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారని, వారి త్యాగాలు, ఆదర్శాల పునాదులపైనే నేటి నూతన ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధింపును పురస్కరించుకుని జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్య దినోత్సవంగా పాటిస్తోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ బాధితులను గౌరవిస్తూ పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read : ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

ఇదే రోజున క్విట్ ఇండియా ఉద్యమం 84వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు సీఎం సువేందు అధికారీ నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపును గుర్తుచేసుకుంటూ, స్వేచ్ఛాయుత భారత్ కోసం వేలాది మంది ప్రాణ త్యాగం చేశారని ఆయన సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.

ఆగస్టు 9న స్వాతంత్ర్య సమరయోధుల అసమాన త్యాగాలను స్మరించుకుంటూ వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. వారు చేసిన త్యాగాలే నేటి స్వతంత్ర భారతదేశానికి పునాది అని ఆయన పేర్కొన్నారు. ఒకే రోజున క్విట్ ఇండియా యోధులకు అంజలి ఘటిస్తూనే, ఎమర్జెన్సీ బాధితులకు పింఛన్ సాయాన్ని సీఎం ప్రకటించారు.

Also Read : ఈ రాశులకు పట్టనున్న అదృష్టం.. ఈ ఒక్క దేవుడిని పఠిస్తే చాలు.. సమస్యలన్నీ క్లియర్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.