Tamil Nadu : తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాల (TASMAC) నిర్వహణను పూర్తిగా సంస్కరించే దిశగా నూతన టీవీకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టాస్మాక్ అవుట్‌లెట్లలో పనిచేసే ఉద్యోగుల జీతాలను ఏకంగా 25% పెంచుతూ విజయ్ సర్కార్ ఆమోదం తెలిపింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సిబ్బందికి జీతాల సవరణ జరగడం ఇదే మొదటిసారి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ మద్యం దుకాణాల పనితీరును మెరుగుపరచడంతో పాటు, చాలా కాలంగా వస్తున్న అవినీతి ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మద్యం షాపుల్లో వినియోగదారుల నుండి ప్రతి సీసాపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు చాలా కాలంగా వస్తున్నాయి. జీతాలు పెంచడం ద్వారా ఇలాంటి అక్రమ వసూళ్లను, అవినీతిని పూర్తిగా అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మెరుగైన జీతాలు ఇవ్వడం వల్ల ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు నమ్ముతున్నారు. ఈ నిర్ణయంపై ఎక్సైజ్ శాఖ మంత్రి విఘ్నేష్ మాట్లాడుతూ.. జీతాల పెంపు వల్ల సిబ్బంది ప్రజల నుండి అదనపు డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం ఉండదని, ఇది వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని స్పష్టం చేశారు.

ఈ జీతాల పెంపు అనేది టాస్మాక్‌లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పెద్ద సంస్కరణల్లో ఒక భాగం మాత్రమే. ఈ ఏడాది ప్రారంభంలోనే సీఎం జోసెఫ్ విజయ్ ఆదేశాల మేరకు.. గుడులు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా స్థలాలకు, విద్యాసంస్థలకు బస్టాండ్‌లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 మద్యం దుకాణాలను శాశ్వతంగా మూసివేశారు. రాష్ట్రంలోని మొత్తం 4,765 షాపుల్లో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ఈ 717 దుకాణాలను తొలగించడం ద్వారా సున్నితమైన ప్రాంతాల్లో మద్యానికి దూరంగా ఉంచవచ్చనే ఉద్దేశంతో ఈ సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల సంఖ్యను మరింత తగ్గించాలని కోరారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ కూడా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తూ.. ఇది ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ అని, దీనివల్ల మహిళలు, విద్యార్థులకు మరింత భద్రత లభిస్తుందని అన్నారు. కేవలం మద్యం పాలసీలోనే కాకుండా, అధికారంలోకి వచ్చిన నాటి నుండి విజయ్ ప్రభుత్వం.. గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్, మహిళల రక్షణ కోసం ప్రత్యేక ఫోర్స్, ప్రతి జిల్లాలో డ్రగ్స్ నిరోధక విభాగాల ఏర్పాటు వంటి పలు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.