tanishq gold robbery
tanishq gold robbery

తమిళనాడులోని మదురైలో ఊహించని భారీ దొంగతనం స్థానికులను, పోలీసులను షాక్‌కు గురిచేసింది. రాత్రికి రాత్రే గుర్తుతెలియని దుండగులు రూ.50 కోట్ల విలువైన బంగారాన్ని జ్యూవెలరీ షాపు నుంచి దొచుకెళ్లడం కలకలం రేపింది. నగర నడిబొడ్డున జరిగిన ఈ భారీ చోరీ తమిళనాడులో సంచలనం రేపుతోంది. పూర్తి వివరాల్లోకెళితే..

మదురైలో 10 రోజుల క్రితం తనిష్క్ జ్యూవెలరీ షోరూమ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే కొత్త షోరూమ్‌ కావడంతో కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు షాపు యాజమాన్యం కొత్త కొత్త వజ్రాభరణాలు, బంగారాన్ని ప్రదర్శనకు ఉంచారు. మరోవైపు ఆ షోరూమ్ లోపల కొంతభాగం ఇంటీరియర్ పనులు పూర్తి కాకపోవడంతో.. కొంతమంది కార్మికులు వాటిని ముగించే పనిలో ఉన్నారు. ఇలా కస్టమర్లు, కార్మికులు షోరూమ్ లోపలికి బయటకి తిరుగుతుండటంతో దొంగలు అదే తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

Also Read : అలా చేయకపోతే మాజీ సీఎంను చంపేస్తాం.. లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బెదిరింపు కాల్స్..!

షోరూమ్ ముందు నుంచి భారీగా సెక్యూరిటీ, సీసీ కెమెరాల నిఘా ఉన్నట్లు గుర్తించారు. దీంతో బిల్డింగ్ వెనుక నుంచి సరైన మార్గమని ప్లాన్ వేసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం.. లోపలికి ప్రవేశించి షోరూమ్‌లో ఉన్న మొత్తం ఆభరణాల్లో 30శాతం వరకు అంటే దాదాపు 18 కిలోల మేర నగలను చోరీ చేసి అక్కడ నుంచి పరారయ్యారు. దీని విలువ సుమారు రూ.50 కోట్ల మేర ఉంటుందని సమాచారం. ఇక ఉదయం షోరూమ్ సిబ్బంది తలుపులు తెరిచి చూడగా.. లోపల బంగారు నగలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

అదే సమయంలో వెనుకనుంచి ఎవరో లోపలికి వచ్చిన ఆనవాళ్లు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పక్కా రెక్కీ నిర్వహించిన తర్వాతే ఈ దోపిడీ చేసినట్లు అనుమానిస్తున్నారు. వెంటనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ దోపిడీ వెనుక అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఉందా? లేక షోరూమ్ ఇంటీరియర్ పనులు చేస్తున్న కార్మికులు, స్థానికుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Also Read : కేదార్‌నాథ్ ఆల‌యం మూసివేత‌.. మళ్లీ 6 నెలల తర్వాతే