India-US FTA : భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (India-US FTA) వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతాంగం మరోసారి ఉద్యమబాట పట్టింది. పంజాబ్, హర్యానాతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిర్వహించ తలపెట్టిన ‘మహా పంచాయత్’ కార్యక్రమానికి భారీగా తరలివస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 550 రైతు సంఘాలు, వివిధ సామాజిక సంస్థలు పూర్తి మద్దతు ప్రకటించి భాగస్వామ్యమవుతున్నాయి.

అయితే, రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను అడ్డుకునేందుకు హర్యానా, ఢిల్లీ పోలీసులు సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పంజాబ్‌లోని పాటియాలా వైపు నుంచి వేలాదిగా శంభూ బార్డర్‌కు (Shambhu Border) చేరుకున్న రైతులను పోలీసులు వంతెనలపై భారీ సీమెంట్ దిమ్మెలు, ముళ్లకంచెలు, కాంక్రీట్ బారికేడ్లతో నిరోధించారు. వాటర్ కేనన్లు, భారీ పోలీసు బలగాలను మోహరించి సరిహద్దులను పూర్తిగా సీల్ చేయడంతో పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారతీయ రైతులు, కూలీలు, పశుపోషకులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్‌సీ) నేత జర్మన్‌జిత్ సింగ్ బండాల ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో వేలాది ఎకరాల్లో భారీ ప్రభుత్వ సబ్సిడీలతో వ్యవసాయం జరుగుతుందని, కానీ భారతదేశంలో మెజారిటీ రైతులకు కేవలం 2 నుండి 2.5 ఎకరాల లోపు భూమి మాత్రమే ఉందన్నారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోందని ఆయన విమర్శించారు.

Also Read : ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: పార్లమెంట్ ముట్టడికి ‘సీజేపీ’ పిలుపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కేఅరెస్ట్

ఈ ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా నుంచి చవకైన డెయిరీ,వ్యవసాయ ఉత్పత్తులు భారతీయ మార్కెట్‌లోకి విచ్చలవిడిగా దిగుమతి అవుతాయని రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఇక్కడి చిన్న తరహా రైతులు, పాడి రైతులు అమెరికా దిగుమతులతో పోటీ పడలేక తమ జీవనోపాధిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యవసాయ రంగాన్నే కాకుండా, చిన్న తరహా వ్యాపారాలు, ఉపాధి రంగాలపై కూడా ఇది కోలుకోలేని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

ఢిల్లీకి శాంతియుతంగా వెళ్తున్న తమను అక్రమంగా అడ్డుకోవడంపై రైతు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో భారీగా ఆంక్షలు విధించి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇతర నిరసనలతో వాతావరణం వేడెక్కగా, రైతుల ఆందోళనలు కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింత సున్నితంగా మారింది.

ఈ నిరసనల నేపథ్యంతో జాతీయ రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి సాధారణ ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు మరింత హెచ్చకుండా పోలీసులు శంభూ బార్డర్ పరిసరాల్లో బహుళ అంచెల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల నుంచి వెనక్కి తగ్గే వరకు సరిహద్దుల్లోనే నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు.

Also Read : కొత్తగా వస్తున్న కరోనాకు పాత వ్యాక్సిన్ పని చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.