Gen Z girls : ఈనాటి తరం అమ్మాయిలు అంటే కేవలం రీల్స్, ఫ్యాషన్, సోషల్ మీడియా, సెల్ఫీలకు మాత్రమే పరిమితం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! “జెన్ జీ (Gen Z)” అమ్మాయిల తీరు, తెన్నులు పూర్తిగా వేరు. పాతకాలపు ఆలోచనలకు, సమాజం విధించిన ఆంక్షలకు చెల్లుచీటీ ఇస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు. నిర్లక్ష్యం, నిరంతరం ఫోన్‌తోనే సావాసం అని సమాజం మోపిన అపవాదులను తమ సమయస్ఫూర్తి, తెగువతో పటాపంచలు చేస్తున్నారు.

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్-యుజి (NEET-UG)’ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు చేపట్టిన ఉద్యమంలో ఈ తరం అమ్మాయిలు చూపిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం తెర వెనుక సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాకుండా, సమస్య ఏదైనా సరే నేరుగా వీధుల్లోకి వచ్చి ప్రశ్నించడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. లాఠీ దెబ్బలు, పోలీసుల అరెస్టులు, వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్‌లు… ఏవీ వీరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి.

ఈ పోరాటంలో అమ్మాయిల ప్రవర్తన ఎంతోమందిని అప్రమత్తం చేసింది. మండుటెండను, వర్షాన్ని, ఆకలిదప్పులను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ధర్నాల్లో కూర్చున్నారు. ఒక వైపు హక్కుల కోసం నిరసన తెలుపుతూనే, మరోవైపు తోటి విద్యార్థులకు, నిరసనకారులకు ఆహారం, నీళ్లు అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా, అల్లర్లు లేదా గొడవలు జరిగిన ప్రాంతాలను స్వచ్ఛందంగా శుభ్రం చేస్తూ బాధ్యతాయుత పౌరులుగా నిలిచారు.

సమాజం ఇప్పటికీ స్త్రీలను “సుకుమారులు, అబలలు” అని భావిస్తున్న వేళ, ఈ అమ్మాయిలు తమ రక్షణ కోసం వేరొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేదని నిరూపించారు. తోటి నిరసనకారులను కాపాడటానికి పోలీసుల లాఠీలకు తమ వెన్ను చూపి రక్షణ కవచంగా నిలిచారు. ఒంటిచేత్తో పోలీసు వాహనాలను అడ్డుకున్న సంఘటనలు ఈ తరంలో ఉప్పొంగుతున్న ధైర్యానికి నిదర్శనంగా నిలిచాయి.

జెన్ జీ అమ్మాయిల ఈ అసాధారణ తెగువకు అద్దం పట్టే ప్రధాన సంఘటన ముంబయిలోని శివాజీ పార్క్ వద్ద చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు వ్యాన్ ఎక్కించి తరలిస్తున్న సమయంలో, రియా ఆహిర్ అనే యువతి చేసిన సాహసం దేశమంతటి దృష్టిని ఆకర్షించింది. రియా ఏ రాజకీయ పార్టీకి లేదా విద్యార్థి సంఘానికి చెందిన వ్యక్తి కాదు; ఒక మోడల్, నటి , ‘రియాషాట్’ (RheaShot) అనే క్లోథింగ్ బ్రాండ్ నడుపుతున్న వ్యాపారవేత్త.

అయినా సరే, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా దాదాపు 45 నిమిషాల పాటు పోలీసు వ్యానుకు ఎదురుగా నిలబడి దాన్ని ముందుకు కదలనీయలేదు. తగిన ఉత్తర్వులు, ముందస్తు సమాచారం లేకుండా విద్యార్థులను ఎక్కడికి తరలిస్తున్నారని పోలీసులను నిలదీసింది. ఒకసారి ఎఫ్‌ఐఆర్ నమోదైతే ఆ విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని భావించి, పోలీసులు వారిని సురక్షితంగా వదిలిపెట్టే వరకు ఆ వ్యాన్ ముందు నుంచి కదల్లేదు.

ఈ సంఘటన గురించి రియా స్పందిస్తూ — “ఆ క్షణంలో నాకేదీ ఆలోచించే సమయం లేదు. పోలీస్ వ్యానులో ఉన్నది మన విద్యార్థులు. సక్రమంగా ధర్నా చేస్తున్న వారిపై కేసు నమోదైతే వారి భవిష్యత్తు పాడవుతుందనే ఆందోళన మాత్రమే నన్ను నడిపించింది. పైన ధైర్యంగా కనిపిస్తున్నా లోపల భయంతో వణుకు పుట్టింది, కానీ విద్యార్థుల భవిష్యత్తు ముందు నా భయం చిన్నదైపోయింది” అని పేర్కొన్నారు.

ఈ తరం అమ్మాయిలు సమాజంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. డిజిటల్ మాధ్యమాలను కేవలం వినోదానికే కాకుండా, సామాజిక అవగాహన పెంచడానికి, విద్యార్థుల హక్కుల కోసం మద్దతు కూడగట్టడానికి ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఉద్యమ సమాచారాన్ని వ్యాప్తి చేస్తూనే, క్షేత్రస్థాయిలో శాంతియుతంగా నిరసనలు జరిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

వీరి పోరాట పటిమను చూసి అన్ని తరాల మహిళలు, సమాజంలోని పెద్దలు సైతం ఆశ్చర్యపోయారు. “నాలుగు గోడలకే పరిమితం కావాలి, గొంతు లేపకూడదు, గొడవలకు దూరంగా ఉండాలి” అనే పాత సిద్ధాంతాలను ఈ తరం అమ్మాయిలు పూర్తిగా తిరస్కరించారు. తమ హక్కుల కోసం, న్యాయం కోసం గళమెత్తడంలో తాము ఎవరికీ తీసిపోమని చాటి చెప్పారు.

మొత్తానికి, జెన్ జీ అమ్మాయిలపై ఉన్న ప్రతికూల అభిప్రాయాలన్నీ అపోహలేనని ఇటీవల జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. సమస్యలు ఎదురైనప్పుడు బాధ్యతాయుతంగా స్పందించడం, ఇతరులకు అండగా నిలవడం, సమాజ హితం కోసం ముందడుగు వేయడంలో వీరు సరికొత్త మైలురాళ్లను క్రియేట్ చేస్తున్నారు. అవును… ఈ తరం అమ్మాయిల తీరే వేరు, వారి ధైర్యమే ప్రత్యేకత!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.