Three Sisters Marriage : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా హసన్‌పూర్ పరిధిలోని ధౌరియా గ్రామానికి చెందిన ముగ్గురు యువతులు ఒకే యువకుడిని పెళ్లి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియా) కంటెంట్ క్రియేటర్లుగా గుర్తింపు పొందిన ఈ అక్కాచెల్లెళ్లు తమ కెమెరామెన్‌నే ఒకే వేదికపై వివాహం చేసుకుని స్థానికులతో పాటు ఇరు కుటుంబాల పెద్దలకు ఊహించని షాక్ ఇచ్చారు.ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19) సొంత తోబుట్టువులు కాగా, సంతోష్ (18) వారికి వరసకు సోదరి అవుతుంది. వీరంతా చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి పెరిగారు. రీల్స్, షార్ట్స్ వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముగ్గురికి శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ ఖడక్‌వంశీ అలియాస్ విక్కీ (20) పరిచయమయ్యాడు. గత ఆరు నెలలుగా విక్కీ వారికి కెమెరామెన్‌గా వ్యవహరించడమే కాకుండా, పలు సరదా వీడియోలలో భర్త పాత్ర కూడా పోషించేవాడు.

Also Read : పేపర్ లీకులకు పదేళ్ల జైలు, ₹10 కోట్ల జరిమానా: కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం

ఇటీవల ఈ యువతులకు వేర్వేరు సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తాము పెళ్లయ్యాక వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి విడిపోవాల్సి వస్తుందనే ఆలోచన వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బి.టెక్ రెండో సంవత్సరం చదువుతున్న పెద్దమ్మాయి సరోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. విడిపోయి జీవించడం కంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వారికి వచ్చిందట. చివరకు చనిపోవడం కంటే ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుని కలిసి బ్రతకడమే మేలని భావించి, కెమెరామెన్ విక్కీని ఒప్పించారు. ఏకాంతంగా స్థానిక చాముండా మాత ఆలయానికి వెళ్లిన ఈ నలుగురూ.. పవిత్రమైన అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వికాస్ ఆ ముగ్గురి నుదుట సిందూరం దిద్ది పెళ్లి చేసుకోగా, ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గంటల వ్యవధిలోనే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ విచిత్ర వివాహ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వేడుకకు ఇరువైపులా కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు.

ఈ పెళ్లిపై సోషల్ మీడియాలో, హిందూ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ముగ్గురు సోదరీమణులు మరో వీడియోను విడుదల చేస్తూ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. “ప్రాచీన కాలంలో అయోధ్యను పాలించిన దశరథ మహారాజుకు ముగ్గురు రాణులు ఉన్నారు. మరి అది అప్పట్లో తప్పు లేదా అవమానకరమైన విషయమా?” అని వారు ప్రశ్నించారు. తామంతా మేజర్లమని, తమ సొంత ఇష్టపూర్వకంగానే కలిసి జీవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు,చట్ట నిపుణులు ఈ వివాహంపై స్పందిస్తూ ఇది తీవ్రమైన చట్టపరమైన సమస్య అని స్పష్టం చేశారు. ‘హిందూ వివాహ చట్టం, 1955’ ప్రకారం ఒక వ్యక్తి జీవించి ఉన్న మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా లేదా ఆమె అనుమతి లేకుండా రెండో వివాహం (బహుభార్యత్వం) చేసుకోవడం నేరం. కాబట్టి ఈ పెళ్లికి చట్టప్రకారం ఎలాంటి న్యాయబద్ధత ఉండదని, ఇది చెల్లని వివాహంగానే పరిగణింపబడుతుందని వెల్లడించారు.

Also Read : ఓ వైపు ఎల్‌నినో.. మరో వైపు వర్షాలు.. అసలేం జరుగుతోంది?

వివాదం ముదరడంతో హసన్‌పూర్ సర్కిల్ అధికారి పంకజ్ త్యాగి ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపారు. తమ విచారణలో ఆ ముగ్గురు యువతులు తాము స్వచ్ఛందంగానే, మేజర్లుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంపై కుటుంబ సభ్యుల నుంచి కానీ, ఇతరుల నుంచి కానీ ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రీల్స్ కోసం కెమెరా ముందు భార్యాభర్తలుగా నటించినవారు, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒకటవ్వడం సోషల్ మీడియా ప్రభావంపై సరికొత్త చర్చకు దారితీసింది. డిజిటల్ కంటెంట్, సోషల్ మీడియా తెచ్చిన ప్రాచుర్యం వ్యక్తిగత నిర్ణయాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో అనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. చట్టపరమైన నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ, ఈ ముగ్గురు సోదరీమణుల నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.