
Aadhav Arjuna : తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జున, ఆయన భార్య డైసీ మార్టిన్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 14 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు డైసీ మార్టిన్ సోమవారం ప్రకటించారు. ఆమె లాటరీ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ కుమార్తె. డైసీ ఓ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.
ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 14 ఏళ్ల పాటు తమ జీవిత ప్రయాణం ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఎన్నో మార్పులతో సాగిందని ఆమె తెలిపారు. స్నేహితులుగా, జీవిత భాగస్వాములుగా, తల్లిదండ్రులుగా జీవితంలోని ఎన్నో దశలను కలిసి దాటామని పేర్కొన్నారు.
Also Read : భారత రాడార్లకు చిక్కినా మారని చైనా బుద్ధి.. వార్నింగ్ గాలికి వదిలేసి.. గగనతలంలో 25 నిమిషాలు?
ఇప్పుడు తామిద్దరం భార్యాభర్తలుగా కలిసి కొనసాగకూడదని పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నట్లు డైసీ చెప్పారు. ఇకపై ఇద్దరూ వేర్వేరు దారుల్లో ప్రయాణించనున్నట్లు తెలిపారు. అయితే, వీరిద్దరి విడాకుల ప్రక్రియ మొదలైందా? లేదా విడాకులు పూర్తయ్యాయా? అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
విడిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, తమ బిడ్డ విషయంలో ఇద్దరి బాధ్యత అలాగే ఉంటుందని డైసీ స్పష్టం చేశారు. బిడ్డను కలిసి చూసుకోవడం, తన సంతోషం, ఆరోగ్యాన్ని కాపాడటం తమ ఇద్దరికీ ఎప్పటికీ ముఖ్యమని తెలిపారు. ఆదవ్ అర్జునపై తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని డైసీ పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులో చేపట్టే ప్రతి పనిలోనూ సంతోషంగా ఉండాలని, ప్రశాంతమైన జీవితం గడపాలని, విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ మార్పు సమయంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని, వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని అందరినీ కోరారు. కాగా, ఆదవ్ అర్జున ప్రస్తుతం తమిళనాడులో సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ప్రజాపనులు, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన భార్య డైసీ మార్టిన్ వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు.
Also Read : జొమాటో క్రేజీ ఫీచర్: ఇకపై 40 కి.మీ దూరంలోని రెస్టారెంట్ల నుంచీ ఫుడ్ ఆర్డర్!









