RUDRAPUR GANG RAPE : ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో మంగళవారం కలకలం రేపిన గ్యాంగ్ రేప్ కేసు నిందితులు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. నేరం జరిగిన స్థలానికి తీసుకువెళ్లి సీన్ రీక్రియేషన్ చేసిన అనంతరం తిరిగి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే స్పందించి వెంటాడి నిందితులను పట్టుకోగా, అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఆగ్రహించిన స్థానిక ప్రజలు వారిపై దాడి చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీన్ రీక్రియేషన్ పూర్తి చేసుకుని కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా, నిందితులను తీసుకెళ్తున్న వాహనం తీవ్రమైన ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఆ సమయంలో వాహనం ఒక్కసారిగా మోటారు నిలిచిపోవడంతో వేరే వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులు పోలీసుల కస్టడీ నుంచి విడిపించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంటాడి వారిని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు పారిపోతున్న సమయంలో ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. మొదట గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ, ప్రజల సంఖ్య పెరగడంతో అదనపు పోలీసు బలగాలను రప్పించాల్సి వచ్చింది. క్రమంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్పంగా బలప్రయోగం చేసి గుంపును వెనక్కి నెట్టి, నిందితులను సురక్షితంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి కఠిన భద్రత నడుమ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఎస్పీ అజయ్ గణపతి తెలిపారు.

Also Read : E20 కాంట్రవర్సీపై నితిన్ గడ్కరీ షాకింగ్ రియాక్షన్.. మాట మార్చిన కేంద్ర మంత్రి..!

ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. రుద్రపూర్‌లోని సిడ్కుల్ (SIDCUL) పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న ఒక యువతిపై జూలై 25 రాత్రి ముగ్గురు వ్యక్తులు అపహరణకు పాల్పడి గ్యాంగ్ రేప్‌కు ఒడిగట్టారని ఫిర్యాదు అందింది. బాధితురాలు తన మహిళా స్నేహితురాలు,ఇద్దరు పురుష పరిచయస్థులతో కలిసి భూరారాణి రోడ్డుకు వెళ్లిన సమయంలో మోటార్ సైకిళ్లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. వారందరినీ బలవంతంగా బైక్‌లపై ఎక్కించుకుని గదర్‌పూర్ వైపు తీసుకెళ్లడం ప్రారంభించారు.

ప్రయాణంలో ఉండగానే ఒక పురుషుడు, మరొక మహిళ కదులుతున్న బైక్ పైనుంచి దూకి తప్పించుకున్నారు. అయితే బాధితురాలు, ఆమెతో ఉన్న మరో పురుషుడు నిందితుల గుప్పెట్లోనే ఉండిపోయారు. మార్గమధ్యలో ఆ వ్యక్తిని వదిలేసిన నిందితులు, యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురూ కలిసి ఆమెపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. రాత్రంతా ఆమెను బంధించి, మరుసటి రోజు ఉదయం మెట్రోపాలిస్ అండర్‌పాస్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జూలై 28 తెల్లవారుజామున నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లగా, నిందితులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో గుర్బాజ్ అనే నిందితుడికి గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా, మిగిలిన ఇద్దరిని అరెస్టు చేశారు. గాయపడిన నిందితుడు గుర్బాజ్‌పై ఇప్పటికే 17 నేరపూరిత కేసులు ఉన్నాయని, బాధితురాలికి వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ పూర్తి చేసినట్లు ఎస్పీ తెలిపారు. గ్యాంగ్ రేప్ , కస్టడీ నుంచి పారిపోయేందుకు చేసిన యత్నంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read : మధురై మీనాక్షి ఆలయ భూముల్లో అవకతవకలు… 19 మందిపై ఎఫ్‌ఐఆర్‌

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.