Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రేమకథ అనూహ్య మలుపు తిరిగింది. రాత్రివేళ ప్రియురాలిని కలవడానికి వెళ్లిన 20 ఏళ్ల యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు పట్టుకుని కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే చివరికి ఈ వ్యవహారం కేసు వరకు వెళ్లకుండా.. ఇరు కుటుంబాల అంగీకారంతో ప్రేమికుల పెళ్లికి దారితీసింది.

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పిప్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్‌గఢ్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల ఆకాష్ దివాకర్.. జతి గ్రామానికి చెందిన 19 ఏళ్ల సలోని దివాకర్‌ను ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ దాదాపు మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరూ అప్పుడప్పుడు కలుసుకునేవారని తెలుస్తోంది.

Also Read : జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం!

బుధవారం రాత్రి కూడా ఆకాష్ తన ప్రియురాలు సలోనిని కలవడానికి ఆమె ఇంటి దగ్గరకు వెళ్లాడు. అయితే ఇద్దరూ కలిసి ఉండటాన్ని సలోని కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారు ఆకాష్‌ను పట్టుకుని కొట్టినట్లు సమాచారం. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆకాష్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అయితే ఈ విషయం ఊహించని విధంగా మలుపు తిరిగింది. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఆకాష్, సలోనికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ తిల్హాపూర్ మోడ్ సమీపంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరికీ పెళ్లి జరిపించారు. ఆలయంలో పెళ్లి చేసుకుంటున్న జంటకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి.

ఈ ఘటనపై పిప్రీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ చంద్ర భూషణ్ మౌర్య మాట్లాడుతూ.. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయని, ఎలాంటి పోలీస్ చర్యలు వద్దని చెప్పారని తెలిపారు. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకున్నాయని, అనంతరం యువతీయువకులు ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. మూడేళ్లుగా కొనసాగిన ప్రేమ.. ఓ రాత్రి కలుసుకోవడంతో కుటుంబ సభ్యులకు తెలిసింది. గొడవ, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఈ వ్యవహారం చివరికి అదే కుటుంబాల అంగీకారంతో పెళ్లితో ముగిసింది.

Also Read : క్యాబ్‌ బుక్‌ చేసే ముందు టిప్‌ అడగొద్దు.. కేంద్రం సంచలన ఆదేశాలు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.