
Uttarakhand rain : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమవడమే కాకుండా పలువురు మృత్యవాత పడ్డారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం ఒక్కరోజే వేర్వేరు ఘటనల్లో 12 మంది మృతి చెందినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ (IMD డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ర్ట మంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయ ఏర్పడింది. అల్మోరాలోని ఒడ్యూదా గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలడంతో ముగ్గురు సజీవ సమాది అయ్యారు. మరో ఘటనలో అల్మోరా పట్టణంలోని ధార్కితుని ప్రాంతంలో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు నేపాలీ కార్మికులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్‌లోని కండోలీ బ్రిడ్జి సమీపంలో భారీగా ప్రవహించిన నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆఫరేషన్ నిర్వహించి కారును వెలికి తీయగా అందులో ఇద్దరి మృతదేహాలను కనుగొన్నారు. మరో మహిళను సురక్షితంగా రక్షించారు.









