CJP : ‘నీట్’ (NEET) ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను (FIRs) తక్షణమే ఉపసంహరించుకోవాలని, అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేసింది. కేంద్రం ఇచ్చి న హామీలను నిలబెట్టుకోకపోతే మళ్లీ దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ఆందోళనకారులపై ఎలాంటి కఠిన లేదా ప్రతికార చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా తీవ్రంగా మండిపడ్డారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లను ఉద్దేశించి అశుతోష్ రంకా ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసు చర్యలు తీసుకోబోమని చెప్పిన కేంద్రం, ఇచ్చిన మాటను నీరుగారుస్తోందని ఆరోపించారు. బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని, అంతేకాకుండా ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో నిరసనకారులకు లాజిస్టిక్స్ సపోర్ట్ అందించిన వాలంటీర్లపై పోలీసు బలగాలు, దర్యాప్తు సంస్థల ద్వారా నిఘా ఉంచుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీజేపీ కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని స్పష్టమైన డిమాండ్లను ఉంచింది. నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే రద్దు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులు, వాలంటీర్లను వెంటనే విడుదల చేయాలని కోరింది. అలాగే, బీజేపీ లేదా దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల్లో ఢిల్లీ పోలీసులు కానీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ నిరసనకారులపై కొత్త కేసులు నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. కేసుల ఉపసంహరణ,భవిష్యత్తు చర్యలపై కేంద్రంతో కుదిరిన ఒప్పందానికి సంబంధించిన లిఖితపూర్వక హామీ పత్రాన్ని బుధవారం లోగా తమకు అందజేయాలని డిమాండ్ చేసింది.

గతంలో కేంద్ర విద్యశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత, కేసుల ఎత్తివేతపై కేంద్రంతో చర్చలు జరిపి ఒప్పందం కుదరడంతో జూలై 25న సీజేపీ తమ ఆందోళనను విరమించింది. అయితే ఆందోళన తీవ్రత తగ్గిన కొద్దీ విద్యార్థులను, వాలంటీర్లను ఒక్కొక్కరిగా లక్ష్యంగా చేసుకుని వేధించడం ప్రారంభించారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన లిఖితపూర్వక హామీ రాకపోతే, తాము ఇచ్చిన గడువు ముగిసిన వెంటనే మళ్లీ వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు ప్రారంభిస్తామని హెచ్చరించారు.

సోమవారం నాడు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడారు. ఆందోళన విరమించిన తర్వాత ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం పౌరుల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో, కేసుల్లో చిక్కుకుని చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు, నిరసనకారులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు “సాక్షి” (Sakshi) అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం కేవలం హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని అమలు చేసినప్పుడే దానికి విశ్వసనీయత ఉంటుందని సీజేపీ స్పష్టం చేసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్న ఈ అంశంలో ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే మరింత తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని పునరుద్ఘాటించింది. బుధవారం నాటికి కేసుల రద్దుపై లిఖితపూర్వక గ్యారెంటీ ఇవ్వకపోతే, దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళన జ్వాలలు ఎగిసిపడక తప్పవని రంకా హెచ్చరించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.