Pakistan :  ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు షాకింగ్ డ్రామా నడిపింది. లార్డ్స్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొడుకుల ఇంటర్వ్యూను టీవీలో టెలికాస్ట్ చేయొద్దని పీసీబీ హుకుం జారీ చేసింది. ఒకవేళ ఇంటర్వ్యూ ప్రసారం చేస్తే తాము మైదానంలోకి అసలు రామని, వాకౌట్ చేస్తామని కూడా బెదిరించింది. కానీ బ్రాడ్‌కాస్టర్ స్కై స్పోర్ట్స్ ఆ మాటలను అస్సలు లెక్కచేయకుండా ఆ ఇంటర్వ్యూను యథావిధిగా ప్రసారం చేసింది.

దీంతో పీసీబీకి పీకలదాకా కోపం వచ్చింది. వెంటనే తమ ఆటగాళ్లతో మ్యాచ్ ఆడొద్దని, మైదానంలోకి అడుగుపెట్టొద్దని హుకుం జారీ చేసింది. ఈ గొడవతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రంగంలోకి దిగి సర్దిచెప్పడంతో, చివరికి పాక్ ఆటగాళ్లు లంచ్ తర్వాత మైదానంలోకి వెళ్లి మ్యాచ్ ఆడారు. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం చాలా పాడైపోవడంతో, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ అథర్టన్ ఈ 18 నిమిషాల ఇంటర్వ్యూను చేశాడు. ఇమ్రాన్‌కు మద్దతుగా పాక్ ప్రధానికి లేఖ రాసిన 21 మంది కెప్టెన్లలో ఈ అథర్టన్ కూడా ఒకడు.

మ్యాచ్ సమయంలో ఇమ్రాన్ కొడుకులు టీవీల్లో హైలైట్ అవ్వడం పీసీబీకి అస్సలు నచ్చలేదట. బాబర్ ఆజమ్ టీమ్ మైదానానికి రాదని బెదిరించినా, స్కై స్పోర్ట్స్ మాత్రం ఇంటర్వ్యూ టెలికాస్ట్ ఆపలేదు. చివరికి ఇంగ్లాండ్ బోర్డు మధ్యవర్తిత్వంతోనే పాక్ ప్లేయర్లు ఆడేందుకు ఒప్పుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి బాగోలేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ కెప్టెన్లు పాక్ ప్రధానికి ఇప్పటికి రెండుసార్లు లేఖలు రాశారు. మొదటిసారి ఫిబ్రవరిలో రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రీసెంట్‌గా ఇమ్రాన్‌కు హాస్పిటల్‌లో చెకప్ చేసి మళ్లీ అడియాలా జైల్లోకి మార్చిన సమయంలో రెండో లేఖను పంపారు.

ఈ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కొడుకులు సులేమాన్, ఖాసిమ్ ఖాన్ తమ నాన్న పరిస్థితి తలచుకుని కన్నీరుమున్నీరయ్యారు. జైల్లో తమ తండ్రి ప్రాణాలకు అసలు రక్షణ లేదని, ఆయనకు ఏమైనా జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లోపల ఆయనకు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. ఎలాగైనా ఆయన్ని చంపేయాలని, లేదా వీలైనంత కాలం జైల్లోనే ఉంచి ఆయన గొంతు నొక్కాలని చూస్తున్నారని ఖాసిమ్ ఆ ఇంటర్వ్యూలో ఆరోపించాడు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.