
కామన్వెల్త్ గేమ్స్2026లో భారత్‌కు తొలి రజత పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మణిపూర్‌కు చెందిన రిషికాంత్ అద్భుతమైన ప్రదర్శనతో ఈ పతకాన్ని సాధించారు. ఇండియన్ ఆర్మీలో శిక్షణ పొందిన రిషికాంత్.. గత ఏడాది కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచి రికార్డులు క్రియేట్ చేశారు. అదే ఫామ్‌తో ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లోనూ దేశానికి గర్వకారణంగా నిలిచారు. పూర్తి వివరాల ప్రకారం..
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ నాలుగో రోజుకు (జూలై 26) చేరుకుంది. ఇవాళ జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలు అత్యంత రసవత్తరంగా సాగాయి. పోటీల ప్రారంభం నుంచే రిషికాంత్ ఆదిపత్యం ప్రదర్శించారు. స్నాచ్ రౌండ్‌లో రిషికాంత్ తొలి ప్రయత్నంలోనే 116 కేజీలు ఎత్తారు. ఆ తర్వాత రెండవ ప్రయత్నంలో 119 కేజీలు ఎత్తిన అతడు.. మూడో ప్రయత్నంలో ఏకంగా 121 కేజీల బరువును ఎత్తారు.

దీని ద్వారా గతంలో కామన్వెల్త్ గేమ్స్ స్నాచ్ రికార్డు (120 కేజీలు)ను బ్రేక్ చేసి కొత్త రికార్డును నెలకొల్పారు. అయితే అదే సమయంలో మలేషియా క్రీడాకారుడు మొహమ్మద్ అనిక్ కూడా 121 కేజీల బరువు ఎత్తి ఈ రికార్డును ఈక్వల్ చేశాడు. ఆ తర్వాత జరిగిన క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో దాదాపు 143 కేజీల బరువు మాత్రమే ఎత్తిన రిషికాంత్.. మొత్తం 264 కేజీల (121 కేజీలు + 143 కేజీలు) ప్రదర్శనతో భారత్‌కు సిల్వర్ మెడల్ తీసుకొచ్చారు. కాగా మలేషియాకు చెందిన అనిక్ గోల్డ్ మెడల్ గెలుపొందారు.









