china rtc

RTC ఎలక్ట్రిక్ బస్సుల్లో వాడుతున్న చైనా తయారీ బ్యాటరీలు ఇప్పుడు అధికారులకు, ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా మారాయి. గత కొన్ని రోజులుగా ఈ బ్యాటరీల వల్ల బస్సుల్లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోతున్నాయి. ప్రయాణికులు ఉన్న సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే పెద్ద నష్టం జరుగుతుందని భయపడ్డ ఆర్టీసీ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుస ప్రమాదాలకు గురవుతున్న జేబీఎం కంపెనీకి చెందిన 500 ఎలక్ట్రిక్ బస్సులను గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా నిలిపివేశారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లలో ఢిల్లీకి చెందిన జేబీఎం కంపెనీ 500 బస్సులను సరఫరా చేసే అవకాశం దక్కించుకుంది. ఏడాదిన్నర క్రితం వచ్చిన ఈ బస్సులను ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన వరంగల్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో తిప్పుతోంది. అయితే, ఇటీవల ఈ బస్సుల్లో వరుసగా మూడు ప్రమాదాలు జరిగాయి. కొన్ని నెలల క్రితం ఒక బస్సు తగలబడగా, జూన్ 21న మరో బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. ఆ ప్రమాదంపై విచారణ జరుగుతుండగానే, మూడు రోజుల క్రితం డిపోలో ఉన్న ఇంకో బస్సు కూడా అంటుకుంది. ఈ ప్రమాదాలన్నింటికీ బ్యాటరీల నుంచి వచ్చిన నిప్పే కారణమని ఆర్టీసీ గుర్తించింది.

బస్సులు తయారు చేసిన జేబీఎం కంపెనీకి దేశవ్యాప్తంగా మంచి పేరుంది. వీరు దాదాపు 3,500 బస్సులను వివిధ రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. విమానాశ్రయాల్లో కూడా వీరి బస్సులే వాడుతున్నారు. అయితే, బస్సులు బాగానే ఉన్నా.. వాటిల్లో వాడే బ్యాటరీలను మాత్రం ఈ సంస్థ చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఆ చైనా బ్యాటరీల లోపం వల్లే ఇప్పుడు ఈ మంటలు రేగుతున్నాయి. ఈ సమస్యపై చైనాకు చెందిన సాంకేతిక నిపుణులు కూడా తెలంగాణకు వచ్చి బస్సులను పరిశీలించారు.

బస్సులు పూర్తిగా సురక్షితం అని కంపెనీ గ్యారెంటీ ఇచ్చే వరకు వాటిని రోడ్డుపైకి తెచ్చేది లేదని ఆర్టీసీ తెల్చిచెప్పింది. కంపెనీ ముందు కొన్ని గట్టి షరతులు పెట్టింది. అసలు సమస్య ఎక్కడ వస్తుందో స్పష్టంగా చెప్పాలి, దానికి శాశ్వత పరిష్కారం చూపాలి. హైదరాబాద్ బస్‌భవన్‌లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ పెట్టి, బస్సుల పనితీరును ఎప్పటికప్పుడు గమనించాలి. చైనా బ్యాటరీలు ఇకపై ఎలాంటి ప్రమాదాలకు దారితీయవని లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి.

ఒకేసారి 500 ఎలక్ట్రిక్ బస్సులు ఆగిపోవడంతో ఆయా రూట్లలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. దీన్ని అధిగమించడానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. డిపోల్లో సిద్ధంగా ఉంచిన 300 సాధారణ డీజిల్ బస్సులను ఆ రూట్లలోకి తెచ్చారు. వీటితో పాటు హైదరాబాద్‌లో తిరిగే కొన్ని మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో లగ్జరీ బస్సులను జిల్లాల రూట్లకు మళ్లించారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు మరికొన్ని సాధారణ బస్సులను వాడాలని అధికారులు భావిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.